
- ఎన్డీయే సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్
- దోడాలో అమరులైన జవాన్లకు నివాళి
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఉగ్రదాడులు జరగడం ఆందోళనకరమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. భద్రతా లోపాలకు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బాధ్యత వహించాలని, ఇది ప్రతి దేశభక్తుడి డిమాండ్ అని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ఉగ్రదాడిలో మృతిచెందిన నలుగురు జవాన్లకు మంగళ వారం ఆయన ట్విట్టర్(ఎక్స్) వేదికగా నివాళులర్పించారు. అమర జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రభుత్వ విధానాలే కారణం
జమ్మూకాశ్మీర్‌లోని పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని రాహుల్‌గాంధీ విమర్శించారు.‘‘ఈ వరుస దాడులు జమ్మూకాశ్మీర్‌లో దయనీయ పరిస్థితులను తెలియ జేస్తున్నాయి. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాలను సైనికులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
దేశం మొత్తం టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలబడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు రాజకీయ ఐక్యత అవసరమని, రోజురోజుకూ పెరుగుతున్న టెర్రరిజం ముప్పును ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి ప్రతిపక్షం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.