
న్యూఢిల్లీ: భారత్ పైకి ఉగ్రమూకలను ఎగదోస్తున్న పాకిస్తాన్ విషయంలో తన రక్తం మరుగుతోందంటూ ప్రధాని మోదీ చేసిన కామెంట్లపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కెమెరాల ముందు మాత్రమే ఆయన రక్తం ఎందుకు మరుగుతుందంటూ ఎద్దేవా చేశారు. గురువారం రాజస్థాన్‌లో ప్రధాని స్పీచ్ అనంతరం రాహుల్ ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘మోదీజీ, డొల్ల ప్రసంగాలు చేయడం ఆపండి. ముందు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి. టెర్రరిజంపై పాకిస్తాన్ ఇచ్చే స్టేట్ మెంట్‌ను మీరు ఎందుకు నమ్మారు? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌కు మోకరిల్లి.. ఇండియా ప్రయోజనాలను ఎందుకు పణంగా పెట్టారు? మీ రక్తం కెమెరాల ముందు మాత్రమే ఎందుకు మరుగుతుంది? ప్రపంచ దేశాల ముందు మీరు ఇండియా గౌరవం విషయంలో ఎందుకు రాజీ పడ్డారు?” అని రాహుల్ వరుస ప్రశ్నలు వేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్లతో భేటీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ యూనివర్సిటీలోని నార్త్ క్యాంపస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్లతో సమానత్వం, అకడమిక్ జస్టిస్ గురించి ఆయన మాట్లాడారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) అధ్యక్షుడి కార్యాలయంలో జరిగిన ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో పలు కాలేజీలు, డిపార్ట్‌మెంట్ల నుంచి విద్యార్థులు పాల్గొన్నారని యూనియన్ సభ్యులు వెల్లడించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య భాగస్వామ్యం, సమగ్ర విద్యా ప్రాముఖ్యతను హైలైట్ చేశారని డీయూఎస్‌యూ తెలిపింది.
విద్యావంతులు కండి.. పోరాడండి.. సంఘటితం అవ్వండి.. అనే అంబేద్కర్ వ్యాఖ్యల నుంచి స్ఫూర్తి పొదాలని రాహుల్ సూచించారు. న్యాయమైన, సమ్మిళిత విద్యావ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్టూడెంట్ల పాత్ర క్లాస్ రూమ్‌లకే పరిమితం కాకుండా.. అణగారిన, ప్రాతినిధ్యం లేని వర్గాల కోసం అండగా నిలబడాలన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ పలు సమస్యలను రాహుల్ ముందు ఉంచారు. కుల ఆధారిత వివక్ష, ఉన్నత పరిపాలనా పదవుల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం, మల్టీ నేషనల్ కార్పొరేషన్స్‌లో తమను మినహాయిస్తున్నారని వారు ఆరోపించారు.