
అహ్మదాబాద్: పరువునష్టం కేసుల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. హోం మంత్రి అమిత్ షాను హంతకుడిగా ఆరోపించిన కేసులో ఆయన శుక్రవారం అహ్మదాబాద్ కోర్టుకు హాజరయ్యారు. దీంతోపాటు అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్(ఏడీసీ) బ్యాంక్ దాఖలు చేసిన కేసులోనూ రాహుల్ విచారణ ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో అమిత్ షా చైర్మన్గా ఉన్న ఏడీసీ బ్యాంకు కేంద్రంగా అక్రమాలు జరిగాయంటూ రాహుల్ చేసిన ఆరోపణలపై బ్యాంకు అధికారులు పరువునష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల్లో రాహుల్కు బెయిల్ లభించింది. విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ను డిసెంబర్ 7న విచారిస్తామని కోర్టు తెలిపింది. ప్రధాని మోడీపై అనుచిత కామెంట్లు చేసిన మరో కేసులో కాంగ్రెస్ ఎంపీ గురువారం సూరత్ కోర్టుకు వెళ్లారు. మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ మూడు రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొంటారు.