విద్యార్ధుల భవిష్యత్తుపై సీఎం స్పందించాలి: రేవంత్ రెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తుపై సీఎం స్పందించాలి: రేవంత్ రెడ్డి

ఇంటర్ విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డ్ వద్ద కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ లు ఆందోళన దిగారు. ఇంటర్ రిజల్ట్స్ లో ఇప్పటి వరకు జరిగిన తప్పిదానాలను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ వాస్తవాలని ఒప్పుకున్నాడని  రేవంత్ రెడ్డి అన్నారు.

గతంలో బ్లాక్ లిస్ట్ లో ఉన్న గ్లోబల్ ఏరిన టెక్నాలజీ సంస్థకు పేపర్లను సరిదిద్దే కాంట్రాక్టును ఎందుకు కేటాయించారని రేవంత్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంట్రాక్టు తీసుకున్న సంస్థ విద్యార్థుల భవిష్యత్తును కాల రాస్తుంటే సంబంధిత మంత్రి ఎందుకు స్పందించడం లేదన్నారు. లక్షలాది మంది విద్యార్థులు రోడ్  ఎక్కినా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు.

విద్యాశాఖ మంత్రి ఈ విషయంపై నైతిక బాధ్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు.18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిమ్మకునిరెత్తనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు.

రేవంత్ ఆందోళనలో పరిస్థితి అదుపు తప్పడంతో… పోలీసులు రేవంత్‌ రెడ్డి, సంపత్‌ సహా ఇతర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఉన్న వారిని పీసీసీ చీఫ్ ఉత్తమ్, మధుయాష్కీ గౌడ్ కలిశారు. ఇంటర్మిడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని … శాంతియుతంగా నిరసన తెలిపిన తమ నాయకులను అరెస్ట్ చెయ్యడం అన్యాయం అని ఉత్తమ్ అన్నారు.