పాత మ్యాపులు మాయం చేసిన్రు..ఎన్జీటీని తప్పుదోవ పట్టించిన్రు

పాత మ్యాపులు మాయం చేసిన్రు..ఎన్జీటీని తప్పుదోవ పట్టించిన్రు
  • ఎన్జీటీని తప్పుదోవ పట్టించిన్రు: రేవంత్​రెడ్డి
  • సెక్రటేరియట్​నిర్మాణ అనుమతులన్నీ
    సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకం
  • హుస్సేన్​సాగర్​ చుట్టుపక్కల శాశ్వత కట్టడాలకు పర్మిషన్​ లేదు
  • నిర్మాణం స్టార్ట్​ కాక ముందే దోచుకుంటున్నరు
  • సెక్రటేరియట్​ జాగా పరిశీలించిన ఎన్జీటీ ఎక్స్​పర్ట్స్​ కమిటీ

హైదరాబాద్ , వెలుగుకొత్త సెక్రటేరియట్​ నిర్మాణం కోసం ఇప్పటి వరకు పలు శాఖలు ఇచ్చిన అనుమతులన్నీ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​(ఎన్జీటీ) కమిటీకి ఎంపీ రేవంత్​రెడ్డి ఫిర్యాదు చేశారు. హుస్సేన్ సాగర్ పరిధిలో కిలో మీటర్ వరకు ఎలాంటి శాశ్వత కట్టడాలు చేపట్టకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. సెక్రటేరియట్  కూల్చివేత, తర్వాత సిట్యువేషన్​పై స్టడీకి ఎన్జీటీ నియమించిన ఎక్స్​పర్ట్​ కమిటీ సభ్యులు శశిధర్, నగేష్ , పూర్ణిమ, కురుపయ్య  గురువారం సెక్రటేరియట్ జాగాను 45 నిమిషాల పాటు పరిశీలించారు.

కమిటీకి పీసీసీఎఫ్ శోభ, ఆర్ అండ్​ బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సెక్రటేరియట్ కూల్చివేత వివరాలు అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు అరణ్య భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎంపీ రేవంత్​రెడ్డి కలిసి ఫిర్యాదుచేశారు. 1920 నాటి హుస్సేన్ సాగర్ మ్యాప్ , 2001 నాటి ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్  తీర్పు, 2005 లో ప్రొఫెసర్ హరగోపాల్  వర్సెస్ దక్షిణ మధ్య రైల్వే కేసులో వచ్చిన తీర్పును ఎన్జీటీ టీమ్ కు రేవంత్ అందజేశారు. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. పాత మ్యాపులను ప్రభుత్వం మాయం చేసిందని, ఎన్జీటీని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ‘‘ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఒక కిలో మీటర్ పరిధిలో ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని 2001 నాటి సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఆ తర్వాత కూడా పలు ఎక్స్​పర్ట్స్​ కమిటీలు ఇదే రీతిలో  రిపోర్టులు ఇచ్చాయి. 2001 కంటే ముందు నిర్మాణాలను మినహాయిస్తే.. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత కట్టాడలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. కేసీఆర్ మూఢనమ్మకాల కోసం సెక్రటేరియట్​, గుడి, మజీద్ కూల్చివేశారు. 2006 తర్వాతి మ్యాపులే ఉంచి.. పాత మ్యాపులే మాయం చేశారు” అని ఆయన పేర్కొన్నారు.  ‘‘హైదరాబాద్​ పాత మ్యాప్ లను కేసీఆర్ మాయం చేశారు. సర్వే ఆఫ్ ఇండియాలోనూ మ్యాప్ లు లేవు. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలోని బ్రిటిష్ లైబ్రరీలో మాత్రమే హైదరాబాద్​ పాత మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ ప్రకారం హద్దులు గుర్తించాలి. ఎన్జీటీ కమిటీ వస్తుందన్న సమాచారంతోనే కొత్త సెక్రటేరియట్​ నిర్మాణానికి పర్యావరణ, ఎయిర్ పోర్టు, పీసీబీ క్లియరెన్స్ తెచ్చుకున్నారు. అనుమతులన్నీ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. ఎన్జీటీ టీమ్​ను సర్కారు తప్పు దోవ పట్టించిందన్నారు.

తట్ట మట్టి ఎత్తకముందే 300 కోట్లు పెంచేశారు

సెక్రటేరియట్​ నిర్మాణానికి తట్ట మట్టి ఎత్తకముందే దోపిడీకి తెరలేపారని ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. మొదట్లో నిర్మాణానికి రూ. 4 00 కోట్లు అని అంచనా వేశారని, ఇప్పుడు మరో రూ.300 కోట్లు చేర్చి మొత్తం రూ.700 కోట్లకు పెంచారని విమర్శించారు. పనులు పిలిచే సరికి అది రూ.1200 కోట్లకు పెరుగుతుందన్నారు. కట్టడానికి ఎంత అయితదో  కేసీఆర్ దోపిడీకి అంత అవుతుందని దుయ్యబట్టారు. ‘‘ప్రపంచం కలుషితమైపోయి కరోనా లాంటి వైరస్​లతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. ఇక్కడ పర్యావరణ నియమాలను బ్రేక్​ చేస్తున్నరు. పిచ్చి పరాకాష్టకు చేర్చుకొని సెక్రటేరియట్​ నిర్మాంచాలని చూస్తున్నరు” అని విమర్శించారు. 1991లో పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు గుడి , మసీదులు కూలగొట్టకుండా ప్లేస్ ఆఫ్ వార్ షిప్  295 ఏ చట్టం  తెచ్చారని ఆయన చెప్పారు. గుడిని, మసీదులను కూల్చిలేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.

ఎర్రగడ్డ.. కేసీఆర్ జన్మస్థలం

సెక్రటేరియట్ కట్టుకోవాలంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనో, జూబ్లిహాల్​​లోనో చాలా ప్లేస్ ఉందని రేవంత్ అన్నారు. పార్లమెంట్ కడుతున్నప్పుడు లేని అభ్యంతరం సెక్రటేరియట్ కట్టుకుంటే తప్పా అని అధికార పార్టీలు అనటం సమంజసం కాదని పేర్కొన్నారు.  ‘‘గతంలో ఎర్రగడ్డలో సెక్రటేరియట్​ కడుతమని చెప్పారు. అక్కడ కట్టుకోవచ్చు. అది కేసీఆర్ జన్మస్థలం” అని  రేవంత్  విమర్శించారు. ఎన్జీటీ కమిటీ వచ్చిందని చెప్పి తనను హౌజ్ అరెస్ట్  చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ఎన్జీటీలో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని స్పష్టం చేశారు. సెక్రటేరియట్​ కూల్చివేత పర్యావరణ రూల్స్​కు వ్యతిరేకమని పేర్కొంటూ ఎన్జీటీలో కాంగ్రెస్ జులై 16న పిటిషన్ దాఖలు చేయగా.. జులై 20 న ఎన్జీటీ విచారించి ఎక్స్​పర్ట్స్​ కమిటీని ఏర్పాటు చేసింది. 2 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. దీంతో కమిటీ గురువారం సెక్రటేరియట్​ను పరిశీలించింది.