బ్రిటీష్ పాలకులను సావర్కర్ క్షమాభిక్ష కోరిండు : రాహుల్ గాంధీ

బ్రిటీష్ పాలకులను సావర్కర్ క్షమాభిక్ష కోరిండు : రాహుల్ గాంధీ

బ్రిటీష్ పాలకులను సావర్కర్ క్షమాభిక్ష కోరిండు
ఇంగ్లీషోళ్లకు పని చేసి, పెన్షన్ తీస్కున్నడు 
‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్ గాంధీ కామెంట్స్ 
చేతనైతే మహారాష్ట్రలో యాత్ర ఆపాలని సర్కారుకు సవాల్ 

ముంబై/అకోలా (మహారాష్ట్ర) : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ పై కామెంట్లతో దుమారం రేపారు. సావర్కర్ బ్రిటిష్​ పాలకులకు సాయం చేశారని, భయంతో అనేక సార్లు క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నారని అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం మహారాష్ట్రలోని అకోలా జిల్లా వాడేగావ్​లో  ఆయన మీడియాతో  మాట్లాడారు.

సావర్కర్ బ్రిటిష్ ​పాలకులకు రాసినట్లుగా చెప్తున్న 1920 నాటి ఓ లెటర్ ను ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు. ఆ లేఖలోని ఆఖరి లైన్ ను చదివి వినిపించారు. ‘‘నేను మీకు అత్యంత విధేయతగల సేవకుడిగా ఉంటానని వేడుకుంటున్నా అని రాసిన ఈ లేఖలో సావర్కర్ సంతకం కూడా ఉంది. దీనిని బట్టి ఆయన బ్రిటిష్​వాళ్లకు సాయం చేశారని తెలుస్తోంది” అని రాహుల్ తెలిపారు. గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి నేతలు ఎన్నో ఏండ్లు జైలులో ఉన్నా ఎన్నడూ ఇలాంటి క్షమాభిక్ష లేఖలపై సంతకాలు చేయలేదన్నారు. ఈ లేఖ కాపీని ఆర్ఎస్ఎస్ చీఫ్​ మోహన్ భగవత్ కు పంపుతానని, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ దీనిని చూసుకోవచ్చన్నారు.

మంగళవారం వసీం జిల్లాలోనూ యాత్ర సందర్భంగా సావర్కర్ పై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఆయనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ సింబల్ గా చూస్తున్నాయని, కానీ రెండుమూడేండ్లు జైలులో ఉన్న తర్వాత ఆయన క్షమాభిక్ష లేఖలు రాశారన్నారు. ‘‘సావర్కర్ వేరే పేరుతో తాను గొప్ప వీరుడినంటూ పుస్తకం రాసుకున్నారు. బ్రిటిష్​వాళ్ల కోసం పని చేసి, పెన్షన్ కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేశారు” అని ఆరోపించారు. మహారాష్ట్రలో కొందరు శివసేన (ఏక్ నాథ్ షిండే వర్గం) నేతలు తన యాత్రను ఆపాలని డిమాండ్ చేస్తున్నారని, చేతనైతే ఆపుకోవాలంటూ సవాల్ విసిరారు.  

రాహుల్ కామెంట్లను ఒప్పుకోం: ఉద్ధవ్ థాక్రే 

సావర్కర్ పై రాహుల్ కామెంట్లను తాము ఆమోదించబోమని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నేత ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఫ్రీడం ఫైటర్ సావర్కర్ పట్ల తమకు అపార గౌరవం ఉందన్నారు. ఆయనపై తమ విశ్వాసాన్ని చెరిపివేయలేరని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు సావర్కర్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. 

రాహుల్ పై పోలీస్ కంప్లయింట్  

రాహుల్ కామెంట్లు సావర్కర్ ను అవమానించేలా ఉన్నాయని ఆయన మనవడు రంజిత్ సావర్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ముంబైలోని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఆయన కంప్లయింట్ ఇచ్చారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్​ నానా పటోల్ సావర్కర్ పై ఇలాంటి కామెంట్లే చేశారని, ఆయనపైనా కేసు పెట్టాలని కోరారు. రంజిత్ సావర్కర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.