ఏపీ పీసీసీ చీఫ్ గా శైలజానాథ్ ప్రమాణం

ఏపీ పీసీసీ చీఫ్ గా శైలజానాథ్ ప్రమాణం

అమరావతి, వెలుగు: ఏపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా తులసీ రెడ్డి, మస్తాన్ వలీ బాధ్యతలు తీసుకున్నారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ లీడర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు.  బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీసీపీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి నుంచి సాకే శైలజానాథ్ బాధ్యతలు తీసుకున్నారు.

పార్టీని వీడినోళ్లను తిరిగి రప్పిస్తం

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని పీసీసీ చీఫ్ గా ప్రమాణం చేసిన తర్వాత శైలజానాథ్ మీడియాతో చెప్పారు. విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిరిగి చేర్చుకుంటామని, వారంతా సొంతగూటికి రావాలని పిలుపునిచ్చారు. తొలి ఏడాదిలో కాంగ్రెస్ సీనియర్లను తిరగి పార్టీలోకి తేవడమే లక్ష్యమని శైలజానాథ్ ప్రకటించారు.  పార్టీలో యువతకు చాన్స్ ఇచ్చి ఏపీసీపీలో కొత్త రక్తం నింపుతామన్నారు. మైనార్టీలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీకి వణికిపోయి సీఎం జగన్ రాష్ట్రంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. శైలజానాథ్ పార్టీకి పూర్వ వైభవం తెస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అమరావతి తరలింపు, 3 రాజధానుల ఏర్పాటుపై పార్టీ నిర్ణయాన్ని తర్వలోనే ప్రకటిస్తామని పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ తెలిపారు.  కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్‌ చాందీ, తెలంగాణ పీసీపీ చీఫ్ ఉత్తమ్​కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, కేహెచ్ మునియప్ప, కర్నాటక కాంగ్రెస్ నేత దినేశ్ గుండూరావు తదితరులు పాల్గొన్నారు.