
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభమైంది. మంగళవారం ( జులై 1 ) నుంచి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. ఉచిత స్పర్శ దర్శనం మొదటిరోజు కావడంతో మంగళవారం నాడు సుమారు 1200 మంది భక్తులను అనుమతిచ్చినట్లు తెలిపారు అధికారులు. శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కేవలం శ్రీశైలంలో, కాశీలో మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం.
భక్తుల కోరిక మేరకు క్యూ లైన్ లో వచ్చే భక్తులకు ఆధార్ ద్వారా టోకెన్ జారీ చేసి ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు. గంటకు 600 చొప్పున సుమారు 2 గంటలు శ్రీస్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్వామి వారి భక్తులందరూ ఉచిత స్పర్శ దర్శన సౌకర్యాన్ని వినియోగించుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని తెలిపారు అధికారులు.
ALSO READ | వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
ఇదిలా ఉండగా.. జులై 1 నుంచి సెప్టెంబర్ 31 శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేయనున్నారు. ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను అటవీ అధికారులు నిలిపేశారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు భక్తులను అనుమతించడం లేదని అటవీ అధికారులు తెలిపారు. జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ వాహనాలు నడుపుతుంది.
శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి ఆలయం నల్లమల అడవులలో ఉంది. భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో దట్టమైన అడవి, కొండలు ఉన్నాయి. అందుకే, భద్రత మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అటవీ అధికారులు తెలిపారు.