
హైదరాబాద్: కూకట్ పల్లి GHMC రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మూసాపేట్ 23 సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల రైడ్స్ చేశారు. ట్యాక్స్ విభాగంలో ఓ ఆఫీసర్ లంచం డిమాండ్ చేసిందన్న పక్కా సమచారంతో రైడ్స్ చేయగా ఆమె అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ సునీత లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం గమనార్హం.
లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కిన ఘటన కూకట్‌పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ నిమిత్తం మూసాపేట సర్కిల్ ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ సునీతను సంప్రదించాడు. ఆస్తి మ్యుటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుడి నుంచి ఆమె 80 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా, అతను ఆమెను బ్రతిమిలాడటంతో 30 వేల రూపాయలకు తగ్గేదిలేదని తెగేసి చెప్పింది.
ALSO READ | స్టేట్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ కస్టమర్లకు అలర్ట్.. జూలై 1న మారిన రూల్స్ ఇవే..
ఆమె వేధింపులు తట్టుకోలేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించగా, ఈ రోజు మధ్యాహ్నం సునీతకు బాధితుడు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు. ఆమె నుంచి 30 వేల రూపాయలు, బాధితుడి ఫైల్ స్వాధీనం చేసుకొని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.