
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు బీఆర్ఎస్ భవన్ అడ్డగా మారిందని, దానిని వెంటనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ నేరగాళ్లకు, రౌడీ మూకలకు అడ్డగా మారిందని, ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రాజకీయ పార్టీగా బీఆర్ఎస్‌కు అప్పటి ప్రభుత్వం ఈ భూమిని కొన్ని నిబంధనల మేరకు ఇచ్చిందని, ఆ రూల్స్ ఉల్లంఘించినందున ఈ భవనాన్ని వెంటనే జప్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని సంపత్ కుమార్ వెల్లడించారు.