మైనారిటీలకు సబ్ప్లాన్.. 5వేల కోట్ల బడ్జెట్: షబ్బీర్​అలీ

మైనారిటీలకు సబ్ప్లాన్.. 5వేల కోట్ల బడ్జెట్: షబ్బీర్​అలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మైనారిటీలను అభివృద్ధి చేసే దిశగా మైనారిటీ డిక్లరేషన్​ను రూపొందిస్తున్నామని కాంగ్రెస్ నేత షబ్బీర్​అలీ తెలిపారు. వారి సంక్షేమం కోసం రూ.5 వేల కోట్ల బడ్జెట్​కేటాయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్​లాగానే మైనారిటీ సబ్ ప్లాన్​నూ డిక్లరేషన్​లో పొందుపరుస్తామని వెల్లడించారు. గురువారం ఆయన హోటల్​గోల్కొండలో మైనారిటీ డిక్లరేషన్​కమిటీ చివరి సమావేశాన్ని నిర్వహించారు.

అనంతరం షబ్బీర్​ అలీ మాట్లాడుతూ..షాదీముబారక్​కు ప్రస్తుతం ఇస్తున్న అమౌంట్​ను పెంచుతామని చెప్పారు. మతపరమైన వివక్షను అణచివేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అంతేగాకుండా మైనారిటీల కోసం ప్రత్యేకంగా మెడికల్, ఇంజినీరింగ్​ కాలేజీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్​ మైనారిటీ యూనివర్సిటీని నెలకొల్పేలా డిక్లరేషన్​లో పెడతామని చెప్పారు. డిక్లరేషన్​కు సంబంధించి ముస్లిం, క్రైస్తవులు, జైనులు, దళిత ముస్లింల నుంచి దాదాపు 150 సలహాలు వచ్చాయని వివరించారు. 

వాటిన్నింటినీ పరిశీలించి మంచి పథకాలను డిక్లరేషన్​లో పెడతామని వెల్లడించారు. మైనారిటీలను బీఆర్ఎస్​ ప్రభుత్వం అడుగడుగునా వివక్షకు గురి చేసిందని తెలిపిన షబ్బీర్​అలీ.. కాంగ్రెస్​ తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లను 4 నుంచి 3 శాతానికి తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. డిక్లరేషన్​ను సమగ్రంగా తయారు చేసి పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి అందజేస్తామని పేర్కొన్నారు.