లైఫ్ సైన్సెస్లో రూ. 54 వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు

లైఫ్ సైన్సెస్లో రూ. 54 వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు
  • 18 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు సృష్టించినం: మంత్రి శ్రీధర్​ బాబు
  • లైఫ్​సైన్సెస్​ ఫౌండేషన్ ఆరో బోర్డు మీటింగ్​లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో లైఫ్​ సైన్సెస్ రంగంలో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో లైఫ్​ సైన్సెస్ రంగం అద్భుతమైన ప్రగతి సాధించి గ్లోబల్ లీడర్​గా ఎదిగిందన్నారు. బుధవారం హైదరాబాద్​లో నిర్వహించిన లైఫ్ ​సైన్సెస్ ఫౌండేషన్​ ఆరో బోర్డు సమావేశంలో చైర్మన్ హోదాలో ఆయన పాల్గొన్నారు. లైఫ్ సెన్సెస్ లో భాగమైన ఔషధ తయారీ, మెడికల్ టెక్నాలజీ, టీకాల ఉత్పత్తి రంగాల్లో కొత్తగా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు సృష్టించగలిగామన్నారు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద ఏడు లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. దేశంలో ఈ ఘనత సాధించించిన ఒకే ఒక్క సిటీ హైదరాబాద్. త్వరలో తెలంగాణా నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటిస్తం. పరిశ్రమలను పెద్ద ఎత్తున ఆకర్షించే అత్యుత్తమ విధానంగా ఉంటుంది. 2030 నాటికి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 250 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలని లక్ష్యం నిర్దేశించుకున్నం’’ అని మంత్రి పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 2 వేల లైఫ్​సైన్సెస్​ పరిశ్రమలున్నాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏడాది కాలంగా తాము తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఈ ప్రగతి సాధ్యమైందన్నారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలపై రిపోర్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో యూనివర్సిటీని అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్​గా తీర్చిదిద్దేందుకు ఈ యూనివర్సిటీ తోడ్పడుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువ 80 బిలియన్​ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే 250కిపైగా యూఎస్​ఎఫ్​డీఏ ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఒక్క హైదరాబాద్​లోనే ఉన్నాయి. 20కిపైగా లైఫ్​ సైన్సెస్, మెడ్​టెక్ ఇంక్యుబేటర్లను ఇక్కడే ఏర్పాటు చేశారు.