బీజేపీ ఎజెండా.. మత పెట్టుబడిదారి రాజ్య నిర్మాణమే!

బీజేపీ ఎజెండా.. మత పెట్టుబడిదారి రాజ్య నిర్మాణమే!

ఈ మధ్య కాలంలో ఆర్​ఎస్​ఎస్​/ బీజేపీ భవిష్యత్​ రాజ్య నిర్మాణం ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఆర్​ఎస్​ఎస్​ వంద సంవత్సరాల ఉనికి, దాని అభివృద్ధి, ఆచరణలను రివ్యూ చేస్తూ అది ఇస్తున్న ప్రకటనల ఆధారంగా జరుగుతోంది. 1949లో ఇప్పుడు అమలులో ఉన్న భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంత రీత్యా ఈ రాజ్యాంగం భారతీయ (అంటే హిందూత్వ) చట్ట విలువలను అంతర్లీనం చేసుకోలేదని వివరిస్తూ వచ్చింది. 

అందులో వీళ్లు ప్రధానంగా ఉదహరిస్తూ వచ్చిన గొప్ప ప్రాచీన చట్టం మను ధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రాన్ని  ఇప్పుడు అది అమాంతంగా అమలు చేయలేదు. కనుక దాని అధారంగా  థియోక్రటిక్​ రాజ్యం రావొచ్చు అనే భయం ఉంది. ఆ శాస్త్రం మను అనే రుషి క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుంచి క్రీస్తుశకం రెండవ శతాబ్దం మధ్యకాలంలో రచించాడనేది అంచనా. ఆ నాటికి మనదేశంలో వర్ణ,  కుల వ్యవస్థ బలంగానే ఏర్పడి ఉన్నది. ఆనాటికి మన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పండ్లు,  ఫలసమీకరణ, కొంత జంతువేటపై ఆధారపడి ఉంది. పల్లెలు, గ్రామాలు, అతికొద్దిగా పట్టణ జీవనం ఉండేది.

 బుద్దిజం కూడా అభివృద్ధి చెందిన దశ అది. అయితే ఆ వ్యవస్థ శ్రమ ఆధారంగా శూద్రులు.  వ్యవసాయం, పశుపోషణ, వేట, పండ్లు, కాయగడ్డ సమీకరణ  వాళ్ల శ్రమశక్తి, వాళ్లు రూపొందించుకుంటున్న టెక్నాలజీ మీదనే ఆధార పడి ఉన్నాయి. అప్పటికే  బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్ణాలు, ఉత్పత్తి బయట మతం, వ్యాపారం, రాజవ్యవహారాలతో  జీవిస్తున్నారు.  వారు అప్పటికే  ఉత్పత్తి రంగాన్ని శూద్ర రంగంగా వేరు చేశారు. ఈ దశలో మనుధర్మశాస్త్రం వర్ణ సంకరం జరగకుండా పై మూడు కులాల ఆధిపత్యాన్ని కాపాడడానికి రాయడం జరిగింది. 

సెక్యులర్​, సోషలిజం తొలగించాలనే  వెనకాల..  

మనుధర్మ శాస్త్ర గ్రంథాన్ని రామ్​మాధవ్​ వంటి ఆర్​ఎస్ఎస్​ సిద్ధాంతకర్తలు ఇప్పటికీ పొగుడుతూనే ఉన్నారు.  ఈ దశలో  ఆర్​ఎస్ఎస్​ సీనియర్​ నాయకులు భారత రాజ్యాంగంపై  రకరకాల భాష్యాలు  చెబుతున్నారు.   అందులో ఒక్కటి ప్రియాంబుల్​లోని సెక్యులరిజం, సోషలిజం పదాలను తీసేయ్యాలి అనేది. ఇది అతికొద్ది రోజుల్లో సర్​సంచాలక్​ కాబోతున్న దత్తాత్రేయ హొసబళె ప్రతిపాదన.

 2024 ఎన్నికలకు ముందు అసలు రాజ్యాంగాన్ని మార్చాలనే వాదన ఆర్​ఎస్ఎస్, బీజేపీ మేధావుల నుంచి వచ్చిందే. ఇప్పుడు వారి భవిష్యత్​ రాజ్యనిర్మాణ ఆలోచనలమీద చర్చ మొదలైంది.ఆర్​ఎస్ఎస్​ థియోక్రటిక్​ కార్పొరేట్​ స్టేట్​ (మత పెట్టుబడిదారీ రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణం) గురించి ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతుంది. 

ఈ మధ్య ఢిల్లీలో జరిగిన లోయర్ సమావేశంలో కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఒక మెసేజ్​లో అదే చెప్పారు. అసలు 21వ శతాబ్దంలో థియోక్రట్​ కార్పొరేట్​ స్టేట్​ అంటే ఎలా ఉంటుంది అనే అంశం గురించి కొంత వివరంగా చూడాల్సిన అవసరముంది. 

మను, కౌటిల్య గ్రంథాల ప్రభావంలో..

ఆర్​ఎస్ఎస్ / బీజేపీ జాతీయస్థాయి రాజకీయాలు ఎన్​డీఏ (నేషనల్​ డెమోక్రాటిక్​ అలయన్స్) పేరుతో నడుస్తాయి. అందులో ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగస్వామి చంద్రబాబు నాయుడు, పవన్​ కల్యాణ్. ఈ మొత్తం రాజకీయ గుంపు మత పెట్టుబడి సిద్ధాంత ఆర్థిక ఆలోచన విధానంలో భాగం. ఇది థియోక్రసీ సెక్యులరిజానికి విరుద్ధ వ్యవస్థాగత సిద్ధాంతం. 

గత వంద సంవత్సారాలుగా ఆర్​ఎస్ఎస్​ మత రాజకీయ ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే, మత రాజకీయం రాజ్య వ్యవస్థను మతం పునాదిగా నడపడం ద్వారా ఒక సంస్థగానీ, పార్టీగానీ థియోక్రటిక్ వ్యవస్థ నిర్మాణానికి పూనుకుంటుంది. భారతదేశం శూద్ర బానిసత్వంలో బతుకుతున్నప్పుడు మను ధర్మశాస్త్రం థియోక్రటిక్​ స్టేట్ (మతరాజ్య వ్యవస్థకు) చట్టపర పునాదులు వేసింది. ఈ  పునాదికి మతరాజ్య నిర్మాణప్రక్రియకు బలంగా సహకరించిన గ్రంథం కౌటిల్యుడి అర్థశాస్త్రం.

 ఇది శూద్ర బానిసల శ్రమ దోపిడీ ద్వారా పై మూడు వర్ణాలు ఎలా సుఖవంతమైన జీవన శైలి పొందగలవో, వారు చనిపోయాక స్వర్గప్రాప్తి కూడా ఎలా పొందగలవో  స్పష్టంగా చెప్పింది. అందుకు అనుకూలంగా శూద్ర బానిస ఉత్పత్తి శక్తుల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో సిద్ధాంతీకరించింది. ఈ రెండు గ్రంథాల  సిద్ధాంత నీడలో ముస్లిం రాజులు ఈ దేశంలో ఆధిపత్యం సాధించేవరకు  ఈ దేశ మత రాజ్య ఫ్యూడల్ దోపిడీతో నడిచింది. 

ఆ తరువాత ఇస్లామిక్​ థియోక్రటిక్ రాజరికం ఫ్యూడలిజంతో ముడిపడి ముఖ్యంగా ఉత్పత్తి కులాలనే దోపిడీ చేస్తూ రాజ్యవ్యవస్థను నడిపారు. మొగల్ రాజ్యవ్యవస్థగానీ, తెలంగాణలోని నిజాం రాజ్యవ్యవస్థగాని ఇస్లాం థియోక్రటిక్​ ఫ్యూడలిజంలో భాగంగా నడిచినవే. శూద్ర, దళిత కులాల శ్రమ దోపిడీపైన ఈ మతరాజ్య వ్యవస్థలు కొనసాగాయి. 

ఈస్ట్​ ఇండియా కంపెనీ 

ఈ కంపెనీ ప్రధానంగా బిజినెస్​పై ఆధారపడి రాజ్య నిర్మాణం వైపు పయనించింది. అది క్రిస్టియన్ మతాన్ని అటు బిజినెస్​లో గాని,  రాజ్య నిర్మాణానికి గానీ పునాది చేసుకోలేదు. భారతీయ సంపదను దోచుకోవడం లక్ష్యంగా 1857 వరకు ఆ తరువాత రాజ్యం రాజరిక వ్యవస్థ చేతిలోకిపోయాక కూడా ఇక్కడ థియోక్రటిక్​ లక్షణాలను రాజ్యంలోకి  చొప్పించలేదు. ఈక్రమంలోనే ఇప్పటి మన రాజ్యంగ రచనకు ముందు సెక్యులర్​ చట్టాలు రూపుదిద్దుకున్నాయి. 

మన కానిస్టిట్యుయంట్ అసెంబ్లీ, అంబేద్కర్​ రాజ్యాంగ రచన కమిటీ సెక్యులర్​ రాజ్యాంగ నిర్మాణానికి బ్రిటిష్​ చట్టాలు కొంత ఆధారమైనప్పటికీ మనదేశ ప్రాచీన సెక్యులర్​ ఉత్పత్తి విలువలు ప్రపంచ రాజ్యాల సెక్యూలర్​ సూత్రాలు ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. ఆర్​ఎస్ఎస్​ ప్రతిపాదించినట్లు సెక్యులరిజం పదాన్ని ఈ రాజ్యాంగం నుంచి తొలగిస్తే  థియోక్రటిక్​ రాజ్య నిర్మాణం జరపడానికి వీలు సులభం కాగలుగుతుంది. 

సంస్థల మార్పు తీరు

 ఆర్ఎస్​ఎస్ / బీజేపీలు దేశంలోని వివిధ సంస్థలను క్రమంగా మారుస్తున్నాయి. అయితే, ఆ మార్పు 140 కోట్ల ప్రజలుగల దేశం, అందులో కులవ్యవస్థ వారు కావాలనుకునే హిందూత్వ మత రాజ్యంలో సమానత్వం లేక అంటరానితనం నుంచి దొంతరవారి ఆధిపత్యం నడిచే స్థితిలో లౌకికత్వాన్ని దెబ్బతీసి పై కులాల ఆధిపత్యంలోకి తీసుకుకెళుతున్నారు. ఇటువంటి థియోక్రటిక్​ రాజ్యంలో గత పద్నాలుగు ఏళ్లలో పెద్ద పెట్టుబడిదారులంతా తమసెక్యులర్​ బిజినెస్​ స్వభావాన్ని వదులుకొని ఆర్​ఎస్​ఎస్​ మత భావజాలానికి  అనుకూల కార్పొరేట్లుగా మారుతున్నారు. 

దళితులు, ఆదివాసీలు, శూద్ర బీసీలపై ప్రభావం

భారత్​లో థియోక్రటిక్ కార్పొరేట్​ స్టేట్​ను ఆర్​ఎస్​ఎస్, బీజేపీలు ఎస్టాబ్లిష్​ చేస్తే ఉత్పత్తి కులాలు ఏ రంగంలోనూ సమానత్వాన్ని ఆశించలేవు. హిందూత్వ థియోక్రటిక్​ కార్పొరేట్ స్టేట్ ప్రపంచంలో  ఏ దేశంలో కూడా, ఏ దశలో కూడా పనిచేయని విధంగా పనిచేస్తుంది. 

దీని ప్రభావం, ముస్లింలు, క్రిస్టియన్ల మీద కంటే దళితులు, ఆదివాసీలు, శూద్ర బీసీలమీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కార్పొరేట్​ పెట్టుబడి ఊహించని రీతిలో వారిని బానిసత్వంలోకి నెట్టివేస్తుంది. దీని ప్రభావం మనం చూసిన 1975 ఎమర్జెన్సీలాగనో, యూరప్​లో ముఖ్యంగా జర్మనీ, ఇటలీలో పనిచేసిన పాసిజంలాగ ఉండదు. ఇది మతం మత్తులో కిందికులాలకు స్లోపాయిజన్​ను ఎక్కిస్తుంది. దాని మొత్తం ప్రభావాన్ని ఇప్పుడు అంచనావేయడం కూడా కష్టం. చంద్రబాబు వంటి ఎన్​డీఏ భాగస్వాములు కూడా ఇందులో ఉన్నారు కనుక పరిస్థితి చాలా భయానకంగా ఉండే అవకాశం ఉంది. 

థియోలాజికల్​ కార్పొరేట్లు

 దేశంలోని అన్ని రంగాలు.. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, విద్యాసంస్థలు, మీడియా ఈ  మత కార్పొరేట్ల చేతుల్లోకి మారుతున్నాయి. దీనివల్ల ప్రమాదం కేవలం మైనార్టీలకు మాత్రమే కాదు. మొత్తం ఉత్పత్తి కులాలు అన్ని రంగాల్లో మత కార్పొరేట్ల లేబర్​గా మారి ఆధునిక బానిసలవ్వడం జరుగుతుంది. 

సెక్యులరిజం లేనటువంటి ముస్లిం దేశాల్లో నవాబులు, ఫ్యూడల్​ ప్రభువులు రాజ్యాన్ని,  కార్పొరేట్​ ఆయిల్​ కంపెనీలను, ట్రాన్స్​పోర్టు, రంగాలను థియోక్రటిక్​ రాజ్యం కిందికి తెచ్చుకున్నది మన కండ్ల ముందున్నది. పాకిస్తాన్​ ఆ తోవలోకి పోయింది. అక్కడ ప్రజాస్వామ్యం బతికే స్థితి లేదు. థియోక్రటిక్​ కార్పొరేట్​ ముస్లిం దేశాల్లో స్త్రీల స్థితి దీనంగా  ఉంది.

- కంచ ఐలయ్య షఫర్డ్-