- నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు
- ఎన్డీయే ఎంపీలూ మద్దతు ఇస్తారని ఆశిస్తున్న
- ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగ రక్షణ కోసమే ఉప రాష్ట్రపతి ఎన్నిక బరిలో నిలిచానని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు మసకబారుతున్న మాట వాస్తవమని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బుధవారం ఢిల్లీలో ‘వీ6 వెలుగు’కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఏ పార్టీకి చెందని తనను.. దేశం నలుమూలలకు చెందిన పార్టీలు అభ్యర్థిగా ఎన్నుకోవడం సాధారణ విషయం కాదన్నారు. ‘‘నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. అలా అని రాజకీయాలతో సంబంధం లేదని చెప్పలేం. కాకపోతే పార్టీ పరమైన భావజాలం, సైద్ధాంతికతకు మాత్రం నేను దూరం. దేశంలో సుమారు 100 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. వాళ్లందరికీ ఏదో ఒక పార్టీపై అవగాహన లేదా అభిమానం ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఎంపీలు విజ్ఞతతో ఓటు వేయాలి..
ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేది రాజకీయ పార్టీలు కాదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ‘‘కేవలం అభ్యర్థిని ఎన్నుకోవడం వరకే పార్టీల పని. ఉప రాష్ట్రపతిని ఎన్నుకునే బాధ్యత పార్లమెంట్ సభ్యులదే. ఈ ఎన్నికకు పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఎంపీలు తమ ఇష్టానుసారం ఓటు వేయవచ్చు. అందుకే సంఖ్యాబలం జోలికి నేను వెళ్లడం లేదు. ఎన్డీఏ కూటమిలోని ఎంపీలు కూడా నాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు. దేశానికి దశదిశ చూపించాల్సిన సమయం వచ్చిందని, ఈ కీలక సమయంలో ఎంపీలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తనకు ఓటు వేయాలని ఎన్డీఏ ఎంపీలను కలిసి కోరుతానని చెప్పారు.
నన్ను ఖర్గేనే అడిగారు..
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని తనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. కొన్ని గంటలు ఆలోచించుకొని, అందుకు ఓకే చెప్పానని తెలిపారు. ‘‘పార్లమెంట్‌లో సంఖ్యా బలం ఎలా ఉన్నా... దేశంలో 63 నుంచి 64 శాతం మంది ప్రజలకు ఇండియా కూటమి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ప్రస్తుతం దేశ ప్రజలు వీరి ఉంటే ఉన్నారు.
నేను ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఇది కూడా ఒక కారణం” అని అన్నారు. ‘‘ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నేను ఖరారైనట్టు సీఎం రేవంత్ రెడ్డే నాకు చెప్పారు. అయితే అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్రపై పార్టీ నేతలను అడిగితే తెలుస్తుంది. నా ఎంపికలో సీఎం పాత్ర ఉంది కాబట్టే తెలుగు వారిని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో తప్పేమీ లేదు” అని పేర్కొన్నారు.
