
- బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: డీఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లు, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగాయి. రంజిత్‌రెడ్డి భాగస్వామిగా ఉన్న డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లు సహా శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్‌ఫ్రా, పౌల్ట్రీ ప్రాజెక్టు ఆఫీసుల్లో ఐటీ అధికారులు బుధవారం కూడా సోదాలు నిర్వహించారు. ఐటీ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో మంగళవారం ఉదయం ప్రారంభమైన సోదాలు.. బుధవారం రాత్రి వరకు కొనసాగాయి.
రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులను బ్యాంక్‌కు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేశారు. లాకర్లలో నగదుతో పాటు బంగారం పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు సహా బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలిసింది. లెక్కలు లేని డబ్బుకు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
రంజిత్ రెడ్డికి చెందిన పౌల్ట్రీ ప్రాజెక్ట్ భాగస్వామిగా ఉన్న అనగందుల తిరుపతి సహా ఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో సంబంధాలు ఉన్న వెంకటరామిరెడ్డి సంస్థల్లో సోదాలు చేశారు. శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్, డీఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల మధ్య జరిగిన అగ్రిమెంట్లకు చెందిన డాక్యుమెంట్లు సీజ్ చేశారు.