
- టూరిస్టుల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
- డెవలప్మెంట్వర్క్స్ చేసేందుకు ఇప్పటికే టెండర్ల ఆహ్వానం
- ప్రపంచ సుందరీమణుల సందర్శనతో పెరిగిన పర్యాటకులు
- పాలమూరులో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం
మహబూబ్‌నగర్, వెలుగు : తెలంగాణలో టూరిజం డెవలప్మెంట్పై రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి.. జిల్లాల్లోని చారిత్రక ప్రదేశాలు, ప్రముఖ పుణ్య క్షేత్రాలను సంరక్షించే చర్యలు ప్రారంభిం చింది. ఇందులో భాగంగా వాటికి నిధులు కూడా కేటాయిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 700 ఏండ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రిపై కూడా ఫోకస్ చేసింది. ఇక్కడి ఊడలమర్రి (మహావృక్షం) సందర్శనకు వచ్చే పర్యాటకులకు మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 కోట్ల నిధులు
పిల్లలమర్రిని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.2.50 కోట్లతో టూరిజం శాఖ, మరో రూ.2.50 కోట్ల ఫారెస్ట్డిపార్ట్మెంట్పనులు చేపడతాయి. నాలుగు రోజుల కింద టూరిజం శాఖ టెండర్లను కూడా ఆహ్వానించింది. ఆ శాఖ నిధులు రూ.2.50 కోట్లతో పిల్లలమర్రిలోని డీర్‌పార్క్, మహావృక్షం ప్రాంతాల్లో టాయిలెట్స్ నిర్మించనుంది.
ప్రస్తుతమున్న క్యాంటీన్‌ను ఆధునీకరించనుంది. కాగా.. పిల్లల కోసం ప్లే పార్కు, పిల్లలమర్రి చెట్టు వెనక దెబ్బతిన్న కాంపౌండ్‌వాల్, బోర్లు వేసి పైపులైన్ సిస్టమ్ ను ఏర్పాటు పనులు చేయాల్సి ఉంటుంది. టెండర్దక్కించుకున్న సంస్థ ఆరు నెలల్లోపు పనులు పూర్తి చేసేలా టూరిజం శాఖ డెడ్‌లైన్ విధించనుంది.
సుందరీమణుల సందర్శనతో పెరిగిన ప్రాధాన్యం
తెలంగాణ వేదికగా గత మే నెలలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా వివిధ దేశాల సుందరీమణులు పిల్లలమర్రిని సందర్శించారు. ఇక్కడి మహావృక్షం వివరాలు తెలుసుకుని సంబురపడ్డారు. కాగా.. వందల ఏండ్ల చరిత్ర కలిగిన మర్రిచెట్టుకు 2018లో పెస్ట్డిసీజ్వచ్చింది. కొమ్మలు విరుగుతూ ఒరిగిపోయే దశకు చేరుకోగా.. పునరుజ్జీవం చేశారు. దీంతో 2018 నుంచి 2024 వరకు సందర్శనకు పర్యాటకులను అనుమతించలేదు. అనంతరం ప్రపంచ సుందరీమణుల విజిట్ తర్వాత ప్రాధాన్యం పెరిగింది. తద్వారా పర్యాటకుల రద్దీ ఎక్కువైంది. ఇక్కడికి వచ్చే వారికి కనీస వసతులు, ఏర్పాట్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.