టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
  •  మాఫియాలా తిరుమలలో హోటళ్లు: టీటీటీ చైర్మన్ 
  • బీఆర్ నాయుడు


హైదరాబాద్, వెలుగు: అన్యమత ప్రచారం చేసే టీటీడీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నామని, వారిని విధుల నుంచి తొలగిస్తున్నామని చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. నిర్విరామంగా తిరుమలలో అన్నదానం అందిస్తున్నామని, నిత్యం 2 లక్షల మంది అన్నదానం స్వీకరిస్తున్నారన్నారు. బుధవారం హైదరాబాద్ లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు కూడా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కొండపై క్యాంటీన్లలో వైసీపీ మాఫియా నడిచిందని, తిరుమలలో హోటళ్లు మాఫియాలా తయారయ్యాయని, దీనిపై లీగల్​గా ఫైట్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. త్వరలోనే కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. 

సీఎం ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, రూ.4 కోట్లు ఖర్చు చేసి ఒంటిమిట్టలో ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ పేర్కొన్నారు. అలిపిరిలో చెకింగ్​పాయింట్​దగ్గర స్కానర్లను అప్​గ్రేడ్ చేస్తున్నామని, తిరుమలలో దర్శనాలు, ప్రసాదాల విషయంలో సైబర్​నేరగాళ్లు చొరబడుతున్నారని, 30వేల ఫేక్​వెబ్ సైట్లపై ఫిర్యాదు చేశామన్నారు. సైబర్​సెక్యూరిటీ ల్యాబ్​నిర్మించాలని ఆలోచన చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఆహార పదార్థాల టెస్టింగ్​కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశామని, సీఎస్ఐఆర్​ల్యాబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పలువురు నేతలకు 
నోటీసులు ఇచ్చామన్నారు.