
ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సుపరిపాలన అందించే 120 దేశాల్లో సింగపూర్ కు చెందిన చాండ్లర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గవర్నెన్స్ సంస్థ .. ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ – 2025’ పేరిట చేసిన సర్వేలో ఇండియా 71వ ర్యాంకు పొందింది. తొలిస్థానాన్ని ఫిన్లాండ్ దక్కించుకోగా.. మన పొరుగు దేశాలైన చైనా 41, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, థాయ్ లాండ్ వంటివి మనకంటే మెరుగైన ర్యాంకులను సాధించాయి. ఇక మనతో పాటే ఇంచుమించు సమాన జనాభా కలిగిన చైనా మెరుగైన ర్యాంకులో నిలవడం ద్వారా మన దేశంలో ప్రజలకు అందే ప్రభుత్వ సేవల్లో వెనకబాటుతనాన్ని చూపుతోంది.
ప్రపంచంలోని ఏ దేశానికైనా సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లలాంటివి. ప్రభుత్వాలు ప్రజలకు అందించే పాలనా సేవలను జీవనాడిగానూ చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇవి పౌరుల జీవన, ఆర్థిక మెరుగైన స్థితిగతులను పట్టి చూపుతాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో కార్యకలాపాలు, అధికారులు తీసుకునే బాధ్యతాయుత నిర్ణయాలు మెరుగ్గా, స్థిరంగా ఉండి పారదర్శకత, నిజాయితీ, జవాబుదారీతనంతో అందించినప్పుడే ప్రజలకు మెరుగైన సుపరిపాలన సాధ్యమవుతుంది. వీటిపైనే ప్రభుత్వాల భవిష్యత్ కూడా ఆధారపడి ఉంటుంది. అలా అందించని ప్రభుత్వాలు ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కోల్పోతాయి. ఇవే భవిష్యత్ లో అధికార కుర్చీల నుంచి కూడా దించివేసేందుకు కారణాలుగా మారుతాయి.
మన దేశంలో ప్రస్తుతం టెక్నాలజీ కాలంలో ఈ – గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. కానీ, ఆఫీసుల్లో ఏదైనా పని పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. విస్తృతమైన టెక్నాలజీని వినియోగించుకుంటున్నా.. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత ఎంత..? జవాబుదారీతనమెంత..? బాధ్యత ఎంత..? సుపరిపాలనలో మనమెక్కడున్నాం? అనే ప్రశ్నలు వేసుకోవాల్సిన ఆవశ్యకత పాలకులపై ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.
పంచాయతీ ఆఫీసు నుంచి సెక్రటేరియెట్ దాకా..
ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, కావాల్సిన ధ్రువీకరణ పత్రాల కోసం పంచాయతీ ఆఫీసు నుంచి సెక్రటేరియెట్ దాకా వెళ్లి దరఖాస్తులు ఇస్తారు. ఆ సమస్య చిన్నదైనా, పెద్దదైనా కానీ.. రోజులు, వారాలు, నెలలు, ఏండ్లు పట్టే పరిస్థితులు కనిపిస్తాయి. ఇక తమ పని ఎప్పుడు పూర్తవుతుందో, పత్రాలు చేతికి ఎప్పుడు అందుతాయోనని బాధితులు ఎదురు చూస్తారు.
సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటి పరిస్థితులను నిత్యకృత్యంగా ప్రభుత్వ ఆఫీసుల వద్ద చూడొచ్చు. పాలకులెవరైనా కానీ.. ఇలాంటి పరిస్థితులు షరా మామూలే!. ప్రజా పాలన సేవల్లో జాప్యం, నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రజలకు సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడం ప్రభుత్వాల ముఖ్యవిధి. పారదర్శకత, సమర్థత, వేగం, నాణ్యత వంటివి కీలకం కూడా. ఇవి కొరవడినప్పుడు ఆ ప్రభుత్వాలపై ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది. అంతేకాకుండా ఆగ్రహానికి దారితీసే పరిస్థితులను ప్రచార మాధ్యమాల్లోనూ చూస్తుంటాం.
కెన్యాలో గోస్ట్ వర్కర్స్ గా పరిగణిస్తూ..
మన దేశంలో దశాబ్దాల కిందటే ప్రభుత్వ సేవలు చాలా వరకు డిజిటలైజ్ డ్ అయ్యాయి. కానీ.. ఆఫీసుల్లో వేగంగా సేవలు అందించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పౌర సేవల జాప్యం(డిలే ఇన్ సర్వీస్ డెలివరీ) సమస్యను అధిగమించేందుకు చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నా ఫలితం లేదు.
ఆదాయం, కులం, జననం, మరణం, భూమి వంటి ధ్రువీకరణ పత్రాల సేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నా.. తీవ్ర జాప్యమే ఉంటుంది. ఆఫీసుల్లో పారదర్శకతను మెరుగుపరచడం, సత్వర సేవలను అందించడంలోనూ ఇంకా లోపభూయిష్ఠతే ఉంది.
పౌర సేవల్లో జాప్యం చేసే బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చట్టాల్లో మార్పులు తీసుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు ఉదాహరణ చెప్పుకుంటే.. కెన్యా దేశంలో ప్రభుత్వం ఆఫీసులకు ఆలస్యంగా వచ్చే లేదా డుమ్మా కొట్టే అధికారులను ‘ గోస్ట్ వర్కర్స్’ గా పరిగణిస్తోంది.
అంతేకాదు చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటుంది. ఆపై అధికారుల అటెండెన్స్ ను, పని ట్రాకింగ్ కు రిజిస్టర్‌లను నిర్వహిస్తుంది. అలానే.. చైనాలోనూ ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల పనితీరుపైనా నిఘా పెడుతుంది. ఆ దేశంలో కొన్నేండ్ల కిందట పనితీరు సరిగా లేని, సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేసిన వేల మంది అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది.
సిటిజన్ చార్టర్ కు చట్టబద్ధత ఉండాలి
ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా, పారదర్శకంగా, సకాలంలో అందించే లక్ష్యంతో 1997 నుంచి సిటిజన్ చార్టర్ (పౌర హక్కుల పత్రం) అమలులోకి వచ్చింది. ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రజా సేవా సంస్థలు తమ సేవలు, బాధ్యతలు, సమయపాలనపై పరిమితులను స్పష్టంగా తెలియజేసేందుకు ఇది ఒక ఆధారంగా ఉంది. కానీ, సిటిజన్ చార్టర్ కు ఎలాంటి చట్టబద్ధత లేదు.
కేవలం ఒక గైడ్ గా మాత్రమే ఉంది. ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో ఉత్సవ విగ్రహాల్లానే కనిపిస్తాయి. చట్టపరంగా బలం ఉండాలి. మరోవైపు ప్రజలకు సరైన అవగాహన లేదు. దీనిపై ప్రభుత్వాలు కూడా కల్పించడంలేదు. ఒక సర్టిఫికెట్ ను ఇన్ని రోజుల్లో జారీ చేయాలని అందులో ఉంటుందే.. తప్ప .. ఏ ఒక్కటి సమయానికి ఇవ్వరు. అదే .. గుజరాత్, కర్నాటకలో కొంతవరకు సిటిజన్ చార్టర్ ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి.
హెల్ప్ లైన్, గ్రీవెన్స్ సెల్ వ్యవస్థలను పటిష్ట పరచాలి
కేంద్రం డిజిటల్ ఇండియా, రాష్ట్రాలు మీ సేవ వంటి వ్యవస్థలతో ఆన్ లైన్ సేవలను అందిస్తుండగా.. డిజిటల్ టెక్నాలజీపై అధికారుల్లో శిక్షణ లోపం కనిపిస్తుంది. మండల స్థాయి నుంచే హెల్ప్ లైన్ , గ్రీవెన్స్ సెల్ వ్యవస్థలు పటిష్టంగా ఉండేలా రూపొందించాలి. తద్వారా స్థానికంగానే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి.
క్యూఆర్ కోడ్, స్లాట్, టోకెన్ సిస్టమ్ వంటివి కూడా సమర్థవంతంగా అమలు చేసి, సత్వర సేవలను అందించేలా పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలి. ఇలా బాధ్యతాయుతంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించినప్పుడే దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ప్రజల జీవన నైపుణ్యాలు వృద్ధిచెంది ప్రభుత్వాలపై నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది.
- వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్-