
ఆంగ్లేయుల పరిపాలనలో ‘లార్డ్ రిప్పన్’ స్థానిక ప్రభుత్వాల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేశారు. అందుకే, ఆయనను మనదేశంలో స్థానిక సంస్థల పితామహుడుగా అభివర్ణించారు. స్థానిక సమస్యలు ఒక ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. స్థానిక ప్రజల అవసరాలను తీర్చడంలో స్థానిక ప్రభుత్వాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ప్రజాస్వామ్య విజయం అధికార వికేంద్రీకరణపై ఆధారపడి ఉంటుంది.
అధికార వికేంద్రీకరణకు స్థానిక ప్రభుత్వాలు ఉపకరిస్తాయి. మూడంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థ గ్రామీణ, స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఉదాహరణ. ఇవి పట్టణాలలోని మున్సిపాలిటీలు, నగరాల్లోని నగరపాలక సంస్థలు, గ్రామీణ సంస్థల కిందకి వస్తాయి.
పంచాయతీరాజ్ అంశం రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో చేర్చడం జరిగింది. ఆదేశిక సూత్రాలలోని అంశాలను ప్రభుత్వాలు విధిగా పాటించాలన్న నియమం లేదు. ఈ కారణంగా మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కొంత నిరాదరణకు గురైంది.
1992వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి జవసత్వాలనిచ్చింది. 73వ రాజ్యాంగ సవరణను అనుసరించి ప్రతి గ్రామపంచాయతీలో అనివార్యంగా గ్రామసభ సమావేశాలను సంవత్సరంలో కనీసం రెండుసార్లు నిర్వహించాలి. గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులు. గ్రామసభ గ్రామస్థాయి శాసనసభవలె పనిచేయాలి.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామసభ ప్రధాన పాత్రను పోషిస్తోంది. దురదృష్టవశాత్తు గ్రామసభ సమావేశాలు మొక్కుబడిగా మారాయన్న విమర్శ ఉంది. 73వ రాజ్యాంగ సవరణను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు నియమిత కాలంలో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి.
ఈ బాధ్యతలను నిర్వహించడం కోసం రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించాలి. 11వ షెడ్యూల్‌లో ఉన్న 29 అంశాలను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాలి. కానీ, కేవలం 20% కంటే తక్కువ రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలను బదిలీ చేశాయి.
ఆర్థిక వనరుల సమస్య
పంచాయతీరాజ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ప్రధానమైనది ఆర్థిక వనరుల సమస్య. 73వ రాజ్యాంగ సవరణ అనుసరించి పంచాయతీ సంస్థలకు ఏ రకంగా ఎన్ని నిధులు ఇవ్వాలి అనే అంశాన్ని పరిశీలించి, అవసరమైన సిఫారసులను చేయడం కోసం రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఆర్థికసంఘాన్ని ఏర్పాటు చేయాలి. చాలా రాష్ట్రాల్లో ఇది జరగడం లేదు. తగిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు అందక వాటికి అవసరమైన ఆర్థిక వనరులు లేక పంచాయతీరాజ్ సంస్థలు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
గడువు ముగిసి 19 నెలలు
వైవిధ్యం కలిగిన గ్రామీణ స్థానిక సంస్థల పరిష్కారం పంచాయతీరాజ్ సంస్థలతోనే సాధ్యం. ప్రజా
స్వామ్యం అనే సౌధానికి పంచాయతీరాజ్ సంస్థలు మూలస్తంభాలు. తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలతోపాటు 539 మండల ప్రజా పరిషత్‌ల పాలకవర్గ గడువు 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. 28 జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు 2024 జులై 5వ తేదీతో ముగియగా.. ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లా పరిషత్లతోపాటుగా, ఆ నాలుగు జిల్లాలోని మండల పరిషత్‌ల పాలకవర్గ గడువు 2024 ఆగస్ట్ 5తో ముగిసింది.
గ్రామ పాలన నత్తనడక
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పెండింగ్‌లో ఉన్న కారణంగా పంచాయతీ ఎన్నికల అంశం కొంత గందరగోళానికి గురైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% పదవులను బీసీలకు కేటాయించవచ్చు. సుదీర్ఘ కాలం ఆ సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం సరికాదు. దాంతో పంచాయతీరాజ్ సంస్థలు ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యం లేకుండా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించలేదు. పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఎన్నికలు నిర్వహించని కారణంగా ఆ సంస్థలు పూర్తిగా అధికారాలు అధికారుల చేతిలోకి వెళ్లాయి. పాలకవర్గాలు లేని కారణంగా గ్రామీణులు ప్రజా ఆరోగ్యం, తాగునీరు, పారిశుధ్య సమస్యలతో సతమతమవుతున్నారు. స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోవడం వలన గత 20 నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.2300 కోట్లు నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామీణ అభివృద్ధి నిధులు లేక సమస్యలు ఎదుర్కొంటోంది.
73వ రాజ్యాంగ సవరణ అనుసరించి వెనుకబడిన తరగతులవారితోపాటు మహిళలకు 1/3 వ వంతు రిజర్వేషన్లు, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో కల్పించడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. భారతదేశంలో దేశవ్యాప్తంగా 32.29 లక్షల మంది పంచాయతీరాజ్ సంస్థలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరిలో 46 .6 % మంది మహిళలు. వీరిలో స్వతంత్రంగా పనిచేస్తున్నవారు ఎందరు అన్నది ప్రధాన ప్రశ్న. మహిళా ప్రజాప్రతినిధుల పదవీ బాధ్యతలను అనధికారంగా కుటుంబ సభ్యులు నిర్వహించడం కొన్నిచోట్ల జరుగుతోంది.
పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల పాత్ర పెంపుపై కేంద్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి సునీల్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. మహిళా ప్రజాప్రతినిధులపై పెత్తనం చేసే భర్తలు, బంధువర్గంలోని పురుషులపై భారీగా జరిమానా విధించాలని సునీల్ కుమార్ కమిటీ సూచించింది.
- డా. పి. మోహన్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్, మెంబర్, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్-