
- పెరిగిన కార్డులతో పేదల్లో ఆనందం
- ఉమ్మడి వరంగల్‌లో 12,16,363 చేరిన కార్డుల సంఖ్య
జనగామ, వెలుగు: రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురు చూసిన పేదలకు ఇప్పుడా కష్టాలు తొలగిపోయాయి. అప్లై చేసిన వారంలోనే కొత్త కార్డులు వచ్చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూన్నెళ్లల్లోనే ఏకంగా లక్షకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. తెలంగాణ ప్రజాప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ చేయడంతో పేదల్లో ఆనందం నెలకొంది.
కార్డుల జారీ పై ఫోకస్..
ఉమ్మడి జిల్లాలోని జనగామ, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను అధికారులు స్పీడప్ చేశారు. ప్రతి రోజు మీసేవ కేంద్రాల్లో వందలాది మంది అప్లై చేసుకుంటుండగా, అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారు. కార్డుల జారీని నిరంతరం చేపడుతుండడంతో పేదల్లో ఆనందం నెలకొంది. గత ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వక, పాతవి అప్డేట్కాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ప్రస్తుతం కాంగ్రెస్సర్కారు రేషన్వ్యవస్థ పై ఫోకస్పెంచడంతో సదరు సవరణల కోసం పలువురు దరఖాస్తులు చేసుకుంటున్నారు. జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించి సన్నబియ్యం పంపిణీ ఒకేసారి జూన్‌లో చేపట్టగా, వచ్చే నెల నుంచి మళ్లీ పంపిణీ షురూ కానుంది. ఈ క్రమంలో అధికారులు కొత్త రేషన్‌కార్డుదారులకు బియ్యం పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్త కార్డులు లక్ష..
మూన్నెళ్ల కాలంలో ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో కలిపి మొత్తంగా 1,03,743 కొత్త కార్డులను అధికారులు మంజూరు చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్‌భాషా షేక్, అడిషనల్కలెక్టర్రోహిత్ సింగ్, మిగతా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు రెవెన్యూ యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తుండడంతో జారీ ప్రక్రియ స్పీడందుకుంది. ఉమ్మడి జిల్లాలో మే వరకు రేషన్‌కార్డుల సంఖ్య 11,12, 620 ఉండగా, ఇప్పటి వరకు 12,16,363 కు కార్డుల సంఖ్య చేరింది.
యూనిట్ల సంఖ్య (కుటుంబ సభ్యుల సంఖ్య) 36,17,827కు చేరింది. ప్రతిరోజు కార్డుల జారీ చేపడుతుండగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మూన్నెళ్లల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబబాద్ జిల్లాలో అత్యధికంగా 30,283 కొత్త కార్డులు మంజూరు చేశారు. ఆ తర్వాత జనగామలో 18,836, హనుమకొండలో 18,350, వరంగల్ లో 16,863, జయశంకర్ భూపాలపల్లిలో 11,252, ములుగు జిల్లాలో 8,156 కొత్త కార్డులు మంజూరయ్యాయి.