ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ బిడ్డ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ బిడ్డ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్

న్యూఢిల్లీ: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు ఇండియా కూటమి ముఖ్య నేతలతో కలిసి వెళ్లి ఆయన తన నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీకి సమర్పించారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ బిడ్డ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగడంతో ఆయనకు మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికలో నామినేషన్లకు ఈ నెల 21 చివరి తేదీ. 22న స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 25 వరకు గడువు ఉంది. ఎన్నికకు పోలింగ్ వచ్చే నెల.. సెప్టెంబర్ 09న జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. 

అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా తమిళనాడు నేత, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యాయకోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాజకీయ నేత సీపీ రాధాకృష్ణన్ మధ్య పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింద‌‌‌‌ని రాజ‌‌‌‌కీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిని బరిలోకి దించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చినట్టుగా కూడా అయింది. అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఎన్డీఏ చేసిన ప్రయత్నాలకూ చెక్ పెట్టినట్టయింది. జస్టిస్ సుదర్శన్​రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి అని.. ఆయనకు పార్టీలకు అతీతంగా మద్దతు పలకాలని సీఎం రేవంత్​రెడ్డి కూడా విజ్ఞప్తి చేయడంతో బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రపతి ఎన్నిక మాదిరిగా కాకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేవలం ఎంపీల ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన లోక్​సభలో 543, రాజ్యసభలో 233, నామినేటెడ్ సభ్యులు 12 కలిపితే పార్లమెంట్లో మొత్తం ఎంపీల సంఖ్య 788గా ఉన్నది. అందులో ఎన్డీఏ కూటమికి లోక్​సభలో 293, రాజ్యసభలో 130 కలిపి సంఖ్యా బలం 423గా ఉన్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్​కు లోక్​సభలో 235, రాజ్యసభలో 78 కలిపి 313గా ఉన్నది.