
జవహర్‌నగర్ తన గుండెకాయ అన్న మంత్రి మల్లారెడ్డి.. ప్రజల గుండె చప్పుడు ఆగిపోతున్నా పట్టించుకోవడం లేదని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి మండిపడ్డారు. జవహర్ నగర్ మెయిన్ రోడ్డుపై వర్షపు నీటిలో గాళం వేసి చేపలు పడుతూ ఆయన నిరసన వ్యాక్తం చేశారు. జవహర్ నగర్ కాలనీలలోని దుస్థితిపై సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఇందిరా రాజీవ్ నగర్, గబ్బిలాల పేట, అంబేద్కర్ నగర్ కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించి.. కాలనీలు, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు.
కాలనీలలో అస్తవ్యస్తమైన రోడ్లు ఉన్నాయని, జనం నడవలేని పరిస్థితిలో ఉన్నారని హరివర్ధన్‌రెడ్డి మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వంద ఫీట్ల రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి.. సంవత్సరం గడుస్తున్నా ఎందుకు రోడ్లు వేయడం లేదని నిలదీశారు. కాలనీలలో మురుగు నీరు చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని.. అత్యవసర పరిస్థితిలో అంబులెన్సులు కూడా రాలేని విధంగా జవహర్ నగర్ కాలనీలలోని రోడ్లు ఉన్నాయని ఆరోపించారు.
ప్రజలు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా మంత్రి మల్లారెడ్డి జవహర్‌నగర్‌లో అభివృద్ధి గాలికొదిలేశారని హరివర్ధన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. జవహర్ నగర్ కాలనీలలోకి అభివృద్ధి పనులు చేయకుండా అడుగుపెడితే అధికార పార్టీ నాయకులను, మంత్రి మల్లారెడ్డిని తరిమికొట్టాలని ప్రజలకు ఆయన సూచించారు. రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సోనియా గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచించి మోడల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేస్తామని స్థానిక ప్రజలకు హరివర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు.