పనిచేయని కేసీఆర్ కూడా తప్పుకొంటారా..?

పనిచేయని కేసీఆర్ కూడా తప్పుకొంటారా..?

హైదరాబాద్‌, వెలుగు‘పని చేయండి. లేదా పదవి నుంచి తప్పుకోండి’ అని అని సీఎం కేసీఆర్‌ ఇటీవలి సమావేశంలో ప్రజాప్రతినిధులకు వార్నింగ్‌ ఇచ్చారని, మరి పనిచేయని పక్షంలో సీఎం కూడా ఆ మాటకు కట్టుబడి ఉంటారా? అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఇంకా డబుల్ బెడ్ రూమ్ ఊసే లేదన్నారు. గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేస్తారా? అని అడిగారు. రాష్ట్రమంతటా వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇది నెరవేర్చకపోతే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని కేసీఆర్‌ చెప్పారని విజయశాంతి గుర్తు చేశారు. కానీ ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఇంటింటికి మంచినీరు పథకం అమలైన దాఖలాలు లేవన్నారు. ఇలా గత ఐదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబంధించి ఆయన ఎన్నిసార్లు మాట తప్పారో, దానికి ఆయన ఎన్నిసార్లు పదవి నుంచి తప్పుకోవాలో టీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు. నిధుల విషయంలో కేంద్రాన్ని నిలదీస్తున్న టీఆర్ఎస్.. ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఏ మేరకు విడుదల చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.