విష్ణువర్దన్ ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు

విష్ణువర్దన్ ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు రానున్నారు. భోజనానికి రావాలని విష్ణువర్దన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించడంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కొందరిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని లంచ్‌‌కు పిలిచినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో.. సోదరి విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినా పార్టీలోకి తీసుకోవడంపై విష్ణు గుర్రుగా ఉన్నారు. దీంతో సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీలు విష్ణును కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మంగళవారం కొందరిని లంచ్ కు పిలిచినట్లు సమాచారం. విష్ణు ఇంటికి భట్టి, మధుయాష్కీ, వీహెచ్, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, దాసోజు శ్రవణ్ లు వెళ్లనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. 

తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే... అంతర్గత విబేధాలతో అష్టకష్టాలు పడుతోంది. నేతల మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపుతున్నాయి. ఈక్రమంలో.. విష్ణు ఇంటికి సీనియర్ నేతలు లంచ్ కు వెళ్లనుండడం.. అక్కడ ఎలాంటి చర్చలు జరుపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే.. టీపీసీసీ, రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. విష్ణు వర్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో జరిగే సమావేశంలో ఎలాంటి చర్చ జరుగనుందో చూడాలి.