కాంగ్రెస్ నేతల 36 గంటల నిరాహార దీక్ష

కాంగ్రెస్ నేతల 36 గంటల నిరాహార దీక్ష

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ  కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క … 36 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వానికి నైతికత ఉంటే టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఉపఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.  భట్టి దీక్షకు కుంతియా, జానారెడ్డి, కోందండరాంతో పాటు పలువురు నేతలు మద్దతు తెలిపారు.

కోదండరాం కామెంట్స్

ప్రతిపక్షం ఉండాలని జనాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారి ఓటర్లను కించపరిచారని టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అధికార పార్టీ నుండి ప్రతిపక్షంలోకి వెళ్లిన వారిని సస్పెండ్ చేసినంత తొందరగా… ప్రతిపక్ష పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారి సభ్యత్వం ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యే లకు దొరికిన స్పీకర్ అపాయింట్ మెంట్.. ఇదేం తీరు అని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ నాయకులకి అపాయింట్ మెంట్  దొరకకపోవడం అన్యాయమన్నారు. ఉన్న ఎమ్మెల్యేలంతా అధికార పార్టీ లో ఉంటే ప్రతిపక్షం వారికి మాట్లాడే సమయం ఎక్కడ దొరుకుతుందన్నారు. అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీ ఆవరణలో ప్రశ్నించిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం అరెస్ట్ చేయించడం దారుణమన్నారు.

నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం: రావుల చంద్రశేఖర్ రెడ్డి

రాష్ట్రంలో అప్రజాస్వామికంగా పాలన సాగుతుందన్నారు టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి.  ప్రతిపక్ష పార్టీని కేసీఆర్ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని రావుల అన్నారు

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు: జీవన్ రెడ్డి

ఈ నాలుగేండ్ల పాలనలో ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని..  అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఈ విషయమ్మీద ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. కన్నతల్లి లాంటి సోనియాగాంధీ కొట్టాడని అన్నారు.

అసెంబ్లీ  స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి .. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిస్తే వెళ్లారా? లేదా పిలవకుండానే వెళ్లిపోయారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. ఆ కార్యక్రమంలో మూడో వరుసలో కూర్చోని తెలంగాణ సమాజాన్ని,  ఎమ్మెల్యే లను పోచారం కించపరిచారని జీవన్ రెడ్డి అన్నారు.

వెళ్లినవారికి కనీస ఇంగితం లేదు సీతక్క

టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయిన  ఆ 12 మంది ఎమ్మెల్యేలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, వారిని నమ్మి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వారికి కనీస ఇంగిత జ్ఞానం లేదని ఆమె అన్నారు.

ప్రజా స్వామ్య విలువలను కేసీఆర్ తుంగలో తొక్కేలాగా వ్యవహరిస్తున్నారన్నారు ఆమె. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు వినిపించకూడదని కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. ఈ నష్టం కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదని, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టమని అన్నారు. ఇలాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నకల్వకుంట్ల కుటుంబం పైన, కేసీఆర్ అరాచక పాలన పైన తమ పోరాటం సాగిస్తామని సీతక్క అన్నారు.