
ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది. ఐదో రోజు టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్, వాషింగ్ టన్ సుందర్ పట్టుదల చూపించడంతో డ్రా పై ఆశలు చిగురిస్తున్నాయి. గిల్ (103) వీరోచిత సెంచరీ చేయడంతో చివరి రోజు లంచ్ సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజ్ లో సుందర్ (20), జడేజా (0) ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో మరో 88 పరుగులు వెనకబడి ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ రెండు.. స్టోక్స్, ఆర్చర్ తలో వికెట్ తీసుకున్నారు.
చివరి రెండు సెషన్ లలో ఇండియా 64 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ డ్రా అవుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ కు 6 వికెట్లు తీస్తే మ్యాచ్ తో పాటు సిరీస్ గెలుచుకుంటుంది. దీంతో ఐదో రోజు రెండో సెషన్ కీలకంగా మారనుంది. 2 వికెట్ల నష్టానికి 174 పరుగులతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి అరగంట జాగ్రత్తగానే ఆడింది. నాలుగో రోజు మాదిరి ఐదో రోజు కూడా గిల్, రాహుల్ డిఫెన్స్ కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కవర్స్ లో గిల్ క్యాచ్ మిస్ అవ్వడం మనకు కలిసొచ్చింది. 70 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీని ఎట్టకేలకు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ విడగొట్టాడు.
►ALSO READ | Asia Cup 2025: ఆసియా కప్ 2025.. ఇండియా- పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు
రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ వేసిన ఒక ఇన్ స్వింగ్ డెలివరీ అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చింది. దీంతో రాహుల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గిల్ తో పాటు పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో గిల్ 228 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. గిల్ కు ఈ సిరీస్ లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్ లో 9 వ సెంచరీ.
లంచ్ కు ముందు జోఫ్రా టీమిండియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. సెంచరీ చేసిన గిల్ ను ఔట్ చేసి ఇంగ్లాండ్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 358 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటైంది.