రేవంత్​ ఇంటికి లీడర్ల క్యూ

రేవంత్​ ఇంటికి లీడర్ల క్యూ
  • పీసీసీ చీఫ్​ను కలిసిన పొంగులేటి సహా పలువురు అభ్యర్థులు
  • పోలింగ్ ట్రెండ్​పై నేతల మధ్య చర్చ
  • తక్కువ ఓటింగ్ జరిగిన సెగ్మెంట్లపై ఆరా
  • గెలుపోటముల ప్రభావంపై నేతల డిస్కషన్​

హైదరాబాద్, వెలుగు : ఎగ్జిట్​పోల్స్ ట్రెండ్ కాంగ్రెస్ నేతల్లో కాన్ఫిడెన్స్ మరింత పెంచింది. ఈసారి అధికారం తమదేనని పీసీసీ చీఫ్ సహా కేడర్ అంతా ధీమాగా ఉన్నది. మరోవైపు పోలింగ్ ట్రెండ్​పై పీసీసీ చీఫ్​తో పాటు కాంగ్రెస్ నేతలు పోస్ట్​మార్టం చేస్తున్నారు. శుక్రవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తరలివెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచే రేవంత్ నివాసం వద్ద నేతల సందడి కనిపించింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మల్​రెడ్డి రంగారెడ్డి, బండి రమేశ్, చిన్నారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు రేవంత్​ను కలిశారు. పోలింగ్ ట్రెండ్​పై వారితో రేవంత్ చర్చలు జరిపారు. నియోజకవర్గాల వారీగా జరిగిన పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ నమోదవడానికి గల కారణాలపై రేవంత్ ఆరా తీసినట్టు తెలిసింది. తక్కువ పోలింగ్ జరిగిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితేంటన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిసింది. 

గెలుపోటములపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నదానిపై ఆరా తీశారు. సిటీలో ఓటింగ్ తగ్గినా గ్రామాల్లో పెరగడంతో కాంగ్రెస్ నేతల్లో ధీమా పెరిగినట్టు చెప్తున్నారు. చాలా మంది ఓటర్లు ఈసారి గ్రామాలకు తరలివెళ్లి ఓట్లేయడమంటే.. వారు కచ్చితంగా మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామాల్లో పెరిగిన ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలమన్న కాన్ఫిడెన్స్​లో ఉన్నట్టు చెప్తున్నారు. మరోవైపు పలు నియోజకవర్గాల్లో యూత్ కాంగ్రెస్​వైపే ఉన్నారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు జనాల్లో కాంగ్రెస్​పై నమ్మకం పెంచాయని అనుకుంటున్నారు.

ఈ ఒక్క రోజు పైలం

పలు చోట్ల రిగ్గింగ్​జరిగిందన్న ఆరోపణలు రావడం, గత ఎన్నికల్లో పలు సెగ్మెంట్లలో ఈవీఎంల ద్వారా కొందరు అధికార పార్టీ నేతలకు ఎక్కువ ఓట్లు కలిసేలా చేశారన్న ఆరోపణలున్న నేపథ్యంలో కేడర్ అంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్​ల దగ్గర కాంగ్రెస్ కేడర్ కూడా కాపలా కాస్తున్నది.

గెలిచే ఎమ్మెల్యేలతో క్యాంప్​!

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో గెలిచాక పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లోకి వెళ్లిపోవడంతో ఈసారి అలాంటివి జరగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులను హైదరాబాద్​కు రమ్మన్నట్టు తెలుస్తున్నది. పోలింగ్ ట్రెండ్​ను బట్టి అభ్యర్థులతో క్యాంప్​ను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిపైనా నేతలతో రేవంత్ చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కౌంటింగ్​ జరిగే రోజున హైదరాబాద్​కు తీసుకొచ్చి.. ఆ తర్వాత బెంగళూరుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందన్న దానిపై కాంగ్రెస్ నేతల్లో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. డీకే శివకుమార్ నేతృత్వంలోనే ఇదంతా సాగుతున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే బెంగళూరులోని ఓ స్టార్​హోటల్, రిసార్ట్​నూ బుక్​ చేశారన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. కాంగ్రెస్​కు స్పష్టమైన మెజారిటీ వచ్చేందుకు అవకాశమున్నా.. బీఆర్​ఎస్, బీజేపీలు కలిసి కుట్రలు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్టు టాక్. గతంలో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఇలా పార్టీ అభ్యర్థులను క్యాంపులకు తరలించి కాపాడుకోవాలని కాంగ్రెస్​ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది.