పాలన చేతకాక కాంగ్రెస్​ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నరు : జగదీశ్​ రెడ్డి

పాలన చేతకాక కాంగ్రెస్​ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నరు : జగదీశ్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలకు కరెంట్​కష్టాలు లేకుండా చేసిందని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. పాలన చేతకాక కాంగ్రెస్​నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. ‘‘అప్పులు చేసినా.. ప్రజలకు 24 గంటల కరెంట్​ఇచ్చింది కేసీఆర్ పాలనలోనే..’’ అని ప్రజలకు తెలుసన్నారు. శనివారం బీఆర్ఎస్​ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

2014లో విద్యుత్​రంగంలో రూ.22 వేల కోట్ల అప్పు ఉందని, అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ప్రభుత్వం 3 గంటల కరెంట్​కూడా సరిగా ఇవ్వలేకపోయిందన్నారు. అప్పుడు వారు మిగిల్చిన అప్పు ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగిందన్నారు. అప్పులు తీర్చడం చేతకాకపోతే.. అప్పులు తెచ్చిన సంస్థలకే విద్యుత్​సంస్థలను అప్పగిస్తే వాళ్లే నడుపుకుంటారని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రాద్రి జిల్లా పర్యటనలోనూ అప్పుల గురించే చెబుతున్నారని, కరెంట్​రంగంలో సాధించిన ప్రగతి ఏంటో తాము ఇప్పటికే చెప్పామన్నారు. 

భద్రాద్రి పవర్​ప్లాంట్ లో ఉన్న​సబ్​క్రిటికల్​టెక్నాలజీతో 30కి పైగా ప్లాంట్లు ఆపరేషన్​లో ఉన్నాయన్నారు. విద్యుత్​చట్టంలోనే సబ్​క్రిటికల్​టెక్నాలజీ మార్చుకోవచ్చని ఉందని, దాన్ని తాము ఫాలో అయ్యామని, అసెంబ్లీలోనూ ఇదే విషయం చెప్పామన్నారు. లేని సమస్యను భట్టి పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన ఇప్పటికైనా అప్పుల గురించి మాట్లాడటం మాని తన శాఖలపై దృష్టి పెట్టాలని సూచించారు. 

లంకె బిందెల గురించి సీఎం మాట్లాడుతున్నారని, కాంగ్రెస్​అధికారం కోల్పోయిన రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో లంకె బిందెలు అప్పజెప్పి పోయారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డలో మంత్రులు రౌడీల్లా మాట్లాడారని, వారి తీరు అసెంబ్లీలో, బయట అలాగే ఉందన్నారు. విద్యుత్​రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దిన ప్రభాకర్​రావును దుర్భాషలాడారని, సభలో లేని వ్యక్తిపై నిందలు వేశారన్నారు. సీఎం, మంత్రులు చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ నిజాయతీని నిరూపించుకునేందుకు ఇప్పటికే న్యాయ విచారణ కోరామని అన్నారు.