
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గద్వాల కలెక్టర్ గా పనిచేసిన ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి బీఆర్ఎస్కు ఏజెంట్ గా వ్యవహరించారని గద్వాల జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ టైంలో గద్వాల జిల్లాలో ఆమె పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వారు ఫిర్యాదు చేశారు.
అనంతరం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆమె కలెక్టర్గా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పూర్తి అనుకూలంగా పనిచేశారని, ఆమె తండ్రితో డీల్ కుదిరిన తర్వాతే ఏ పనైనా చేసేవారని పీసీసీ అధికార ప్రతినిధి కేఎస్వీ చారి ఆరోపించారు. గట్టు లిఫ్ట్ ఇరిగేషన్లో ఐదు గ్రామాల్లో రికార్డుల్లో లేని వాళ్లకు కూడా భూమి ఉన్నట్టు కలెక్టర్ సృష్టించారన్నారు.