- ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ లీడర్ల డిమాండ్
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి భవన్, జీఎం ఆఫీసులను తగలబెట్టాలని, రైల్వే లైన్లను కట్‌చేయాలని హింసాత్మక చర్యలకు పాల్పడాలంటూ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు గుండాయిజాన్ని ప్రేరేపిస్తున్నాయని కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో సుమన్ వ్యాఖ్యలను ఖండించారు. లీడర్లు మాట్లాడుతూ.. సుమన్ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ అగ్రనాయకత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
ఆవ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. సింగరేణి, రైల్వే ఆస్తులకు నష్టం చేయాలన్న ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ లీడర్లు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు గడ్డం రజిని, సేవాదళ్ అధ్యక్షుడు సొత్కు ఉదయ్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పి.నర్సింగ్, సీనియర్ నేతలు ఎస్.సుదర్శన్, ఎన్.శ్రీనివాస్, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ పాషా, పట్టణ ఉపాధ్యక్షులు వీరన్న, బి.శంకర్, బి.వేణుగోపాల్, నర్సయ్య, ప్రభాకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.
