
హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ చీఫ్ కోదండరాంకు మద్దతివ్వొద్దని కాంగ్రెస్ నాయకలు పార్టీ మీటింగ్ లో స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే అభ్యర్థిగా ప్రకటించే విషయాన్ని ఆలోచిద్దామని చెప్పారు. కాంగ్రెస్ మద్దతుతో ఆయన ఎమ్మెల్సీగా గెలిచినా.. ఆ విషయాన్ని ఎక్కడా చెప్పరని, సొంత ఇమేజ్ తోనే గెలిచినట్టుగా చెప్పుకుంటారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన కోదండరాం ఆ తర్వాత బీజేపీకి దగ్గరయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఇంతమంది నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నా.. కోదండరాంకు మద్దతివ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై సోమవారం గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని పీసీసీ చీఫ్ ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న నేతలంతా ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై యువత ఆగ్రహంతో ఉందని, దానిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునాయాసంగా గెలిచిందని, ఇక్కడా అలాంటి ఫలితాలే వచ్చే అవకాశముందన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న 20 మంది నాయకులు, పార్టీకి తాము చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని అవకాశం కల్పించాలని పార్టీ ముఖ్య నేతలను కోరారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ అభ్యర్థిత్వంపై పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.