సీఎం ఇంటి ముట్టడిపై కాంగ్రెస్‌‌లో పంచాయితీ

సీఎం ఇంటి ముట్టడిపై కాంగ్రెస్‌‌లో పంచాయితీ
  • రెండున్నర గంటలపాటు ముఖ్యనేతల వాడీవేడి చర్చ
  • రేవంత్ సొంత కార్యక్రమంలా జరిగిందంటున్న నేతలు
  • ఇకపై జేఏసీ చెప్పినట్లు కార్యక్రమాలకు వెళ్లాలని నిర్ణయం

హైదరాబాద్‌‌, వెలుగు:

కాంగ్రెస్‌‌ చేపట్టిన ప్రగతి భవన్‌‌ ముట్టడి సక్సెస్‌‌ అయింది. కానీ ఆ పార్టీలో మాత్రం చిచ్చు పెట్టింది. నేతల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది. పార్టీలో ఒంటెద్దు పోకడలు ఎక్కువయ్యాయని, సమష్టి నిర్ణయాలు జరగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వన్‌‌ మ్యాన్ షోలు ఎక్కువైపోయాయని కొందరు నేతలు మండిపడుతున్నారు. అందరు చర్చించి నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్‌‌లో పద్ధతి అని చెబుతున్నారు. ప్రగతి భవన్‌‌ ముట్టడి అంశంపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ ఆఫీసులో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మరికొన్ని అంశాలపైనా దాదాపుగా రెండున్నర గంటల పాటు వాడీవేడిగా చర్చించారు.

రేవంత్‌‌ సొంత కార్యక్రమంలా

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌‌ సెప్టెంబర్‌‌ 21న ప్రగతి భవన్‌‌ ముట్టడికి పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌‌కు బయలుదేరిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ముఖ్య నేతలను హౌజ్‌‌ అరెస్టు చేశారు. టీపీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, ఎంపీ రేవంత్‌‌ రెడ్డి పోలీసుల కళ్లు గప్పి ప్రగతి భవన్‌‌ ఎంట్రన్స్‌‌ గేటు వద్దకు చేరుకున్నారు. దీంతో ముట్టడి కార్యక్రమంలో క్రెడిట్‌‌ అంతా ఆయనకే పోయినట్లు అయిందని కొందరు నేతలు అంటున్నారు. ముట్టడికి వెళ్లిన ఆయన వీడియోలు సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అయ్యాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్​రెడ్డి హుజూర్‌‌నగర్‌‌ ఎన్నికల్లో ఉండిపోయారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు పలువురు నేతలు ఇంట్లోనే నిర్బంధానికి గురయ్యారు. దాంతో ముట్టడి కార్యక్రమం రేవంత్‌‌ కార్యక్రమంలా జరిగిందని కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు.

పీసీసీ చీఫ్​కు చెప్పకుండానే..?

సెప్టెంబర్‌‌ 17న రేవంత్‌‌ రెడ్డి, షబ్బీర్‌‌ అలీ, దామోదర రాజనర్సింహ.. గాంధీభవన్‌‌లో ప్రెస్‌‌ మీట్‌‌ పెట్టి ఆర్టీసీ ఆర్మికులకు మద్దతుగా ప్రగతి భవన్‌‌ ముట్టడి చేపట్టనున్నట్లు అనౌన్స్‌‌ చేశారు. కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌, సీఎల్పీ నేత భట్టికి తెలియకుండానే ఈ నిర్ణయం జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరుసటి రోజే ఒకరిద్దరు నేతలు మండిపడ్డట్లు తెలుస్తోంది. హుజూర్‌‌నగర్‌‌ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్న నేతలు దీన్ని పెద్దగా సీరియస్‌‌ తీసుకోలేదని సమాచారం. ముట్టడికి ముందు రోజు రేవంత్‌‌ రెడ్డి.. ఉత్తమ్‌‌కు ఫోన్‌‌ చేసి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపు ఇవ్వమని కోరినట్లు తెలిసింది. దాంతో పార్టీ శ్రేణులు ముట్టడిలో పాల్గొనాలని ఉత్తమ్‌‌ పిలుపునిచ్చారు.

పార్టీ విధానాలకు వ్యతిరేకం

ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఒంటెద్దు పోకడతో సాగిందని సీనియర్​ నేతలు అంటున్నారు.కార్యక్రమం చేయాలనుకున్నపుడు పార్టీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతోపాటు ముఖ్య నేతలంతా సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకునే ఆనవాయితీ కాంగ్రెస్​లో ఉందని చెప్పారు. వ్యక్తులుగా పిలుపునివ్వడం వల్ల కార్యక్రమం పూర్తిగా విజయవంతం కాలేదని అంటున్నారు. పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని అధ్యక్షుడు ప్రకటిస్తే మరింత మంది పాల్గొనేవారని చెబుతున్నారు.

హై కమాండ్ దృష్టికి..

పార్టీలో ఇలాంటి పోకడలను ఆదిలోనే తుంచేయాలని, దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌‌ అండగా ఉండాలని, అయితే సొంత కార్యక్రమాలు కాకుండా జేఏసీ నిర్ణయాలకు అనుగుణంగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. నేతల భేటీ తర్వాత ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ సమ్మెతోపాటు రాష్ట్రంలోని వివిధ సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. క్యాజువల్‌‌గా భేటీ అయ్యామని భట్టి విక్రమార్క అన్నారు.

Congress leaders discussion on revanth reddy's Pragati Bhavan siege