మహేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల కంప్లయింట్.. రాష్ట్ర గీతాన్ని అవమానించారని ఆరోపణ

మహేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల కంప్లయింట్.. రాష్ట్ర గీతాన్ని అవమానించారని ఆరోపణ

నిర్మల్, వెలుగు: ఈనెల 18న నిర్మల్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి అవమానించారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు నిర్మల్ టౌన్ సీఐకి ఆదివారం ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాందేడపు చిన్ను ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా చిన్ను మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో అందరూ రాష్ట్ర గీతాలాపన చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే, సెర్ప్ డైరెక్టర్ కుర్చీ నుంచి లేచి నిలబడలేదని, గీతాలాపన కూడా చేయకుండా అవమానించేలా ప్రవర్తించారని ఆరోపించారు.

రాష్ట్ర గీతాన్ని అవమానించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, జిల్లా మైనార్టీ కమిటీ చైర్మన్ జునైద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మర్, ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు హరీశ్, ఎన్నారై సెల్ అధ్యక్షుడు రాకేశ్, దేవరకోట చైర్మన్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ రామకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ సాయి, ఎ.పోశెట్టి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.