
కర్నాటకలో గెలిచారని, తెలంగాణలో కలలు కంటున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నాయకులే లేరు.. పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుని ప్రెసిడెంట్‌ను చేసుకున్నరు. మేం మోదీకే భయపడలేదు.. ఇక్కడ ఒకటి.. రెండు పేపర్లు పిచ్చి రాతలు రాస్తే భయపడ్తమా?’’ అని కామెంట్ చేశారు. ‘‘పాపం ఇక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు (కాంగ్రెస్) కూడా కలిసి కూర్చోలేరు.. ఇక్కడున్న వాళ్లకు అక్కడ గాంధీ భవన్లో గోతులు తవ్వుతున్నరు..
తెలంగాణలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనిపించడం లేదా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతల్ని చూస్తే తనకు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గుర్తొస్తున్నదని కేటీఆర్ అన్నారు. ‘‘క్రికెట్ టీమ్‌లో 11 మంది ఆడుతరు. అయితే వెనుకటికి పాకిస్తాన్ టీమ్ ఉండేది. అందులో కెప్టెన్ ఒకరు ఉంటరు, మిగతా వాళ్లంతా మాజీ కెప్టెన్లు..”అని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో ఉండేది నలుగురు ఎమ్మెల్యేలు.. వీళ్లు నలుగురు కలిసి ఒకేచోట కూర్చొని పనిచేయలేరు. కానీ వీళ్లు నాలుగు కోట్ల మందిని పాలిస్తమని గొప్పలు చెప్తరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నది నలుగురే కానీ పాక్ క్రికెట్ టీమ్ తరహాలోనే కాంగ్రెస్ నేతలు మొత్తం 10 మంది సీఎం అభ్యర్థులం అంటూ ఒకరిపై ఒకరు నెగ్గే ప్రయత్నం చేస్తుంటరు. సీతక్కను రేవంత్‌రెడ్డి సీఎం అంటే..ఆ మాటలు జోక్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటరు” అని కామెంట్ చేశారు. నీళ్లకోసం ఆనాడు జానారెడ్డి దగ్గరికి వెళ్తే కన్నీళ్లు పెట్టించారని కేటీఆర్ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు కాంగ్రెసోళ్లకు 10 సార్లు చాన్స్ ఇచ్చినా వాళ్ల విశ్వసనీయత కాపాడుకోలేకపోయిన్రు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ను దీవిస్తున్నరు” అని చెప్పారు.