కాంగ్రెస్ అభ్యర్థులను 50 వేల మెజార్టీతో గెలిపించాలి : రాహుల్‌‌, ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ అభ్యర్థులను 50 వేల మెజార్టీతో గెలిపించాలి : రాహుల్‌‌, ప్రియాంకా గాంధీ
  • రామాంజాపూర్‌‌ సభలో రాహుల్‌‌, ప్రియాంక గాంధీ
  • రామప్పలో ప్రత్యేక పూజలు చేసిన నేతలు
  • ప్రజల కోసమే పనిచేస్తా ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌ క్యాండిడేట్లను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌‌  నేతలు రాహుల్‌‌గాంధీ, ప్రియాంకా గాంధీ, టీపీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌రెడ్డి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా రామప్పలో బస్సుయాత్ర ప్రారంభించిన అనంతరం మండలంలోని రామాంజపూర్‌‌లో ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జరిగిన విజయభేరి బహిరంగ సభలో  వారు మాట్లాడారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌‌ నిధులను ఫ్యామిలీకి, నీళ్లను వారి భూములకు ఇచ్చుకున్నారని ఆరోపించారు. తెలంగామలో కాంగ్రెస్‌‌కుఒక్క ఛాన్స్‌‌ ఇవ్వాలని కోరారు. ములుగు అత్యంత వెనుకబడిన ప్రాంతమని, గిరిజనుల కోసం కాంగ్రెస్‌‌ ఎంతో చేసిందని భట్టి విక్రమార్క చెప్పారు. పోడు పట్టాలు పంచిన ఘనత కాంగ్రెస్‌‌దేనన్నారు.  

రామప్పలో ప్రత్యేక పూజలు

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప ఆలయాన్ని రాహుల్‌‌గాంధీ, ప్రియాంకాగాంధీ సందర్శించారు. వారికి టీపీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఘన స్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి గైడ్స్‌‌ విజయ్, వెంకటేశ్‌‌ రామప్ప విశిష్టతను తెలియజేశారు.

చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా

కాంగ్రెస్‌‌ అంటేనే పేదలపార్టీ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రామాంజాపూర్‌‌లో జరిగిన మీటింగ్‌‌లో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌‌ మేనిఫెస్టోనే బీఆర్‌‌ఎస్‌‌ కాపీ కొట్టిందన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే తన గొంతు నొక్కాలని సోషల్‌‌ మీడియా వేదికగా ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దొరల గడీల వద్ద కాపలా ఉండే వారు కావాలో, అసెంబ్లీలో ప్రశ్నించే వారు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. అసైన్డ్‌‌, పోడు భూములకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. తనను అసెంబ్లీకి పంపించే బాధ్యత మీదేనన్నారు.

భూపాలపల్లి నియోజవర్గ క్యాండిడేట్‌‌ గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఏండ్ల తరబడి ప్రజల మధ్యే ఉన్నానని, మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో తెలంగాణ ఇన్‌‌చార్జి మాణిక్‌‌ ఠాగూర్‌‌, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు పొదేం వీరయ్య, జగ్గారెడ్డి, జానారెడ్డి, మల్లు రవి, మధు యాష్కి గౌడ్‌‌, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, నాయిని రాజేందర్‌‌రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ సభ్యుడు మల్లాడి రాంరెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గొల్లపెల్లి రాజేందర్‌‌గౌడ్‌‌, బానోతు రవిచందర్‌‌ పాల్గొన్నారు.