ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్​ పార్టీ కీలకంగా వ్యవహరించిందని, తెలంగాణ  ప్రత్యేక రాష్ట్ర సాధన కూడా  కాంగ్రెస్ తోనే  సాధ్యమైందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు  కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ విమోచనం సందర్భంగా శనివారం ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను పట్టించుకోవడంలేదన్నారు. తెలంగాణ స్వాతంత్ర్య సంగ్రామం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఎక్కడ కూడా కనిపించని బీజేపీ లీడర్లు ఇప్పుడు చరిత్రను తప్పుడు ప్రచారం చేస్తూ పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విముక్తి పోరాటంలో టీఆర్ఎస్, బీజేపీల పాత్ర లేదన్నారు. అనంతరం సోన్ ​మండలంలోని సిద్దిలకుంట గ్రామంలో ఏర్పాటు  చేసిన కుమ్రంభీం విగ్రహాన్ని మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు బాపురెడ్డి, అజార్, నాందేడపు చిన్ను, సోన్ ఎంపీపీ మానస హరీశ్​రెడ్డి, మార గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి, భూమేశ్, నిఖిల్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలె
ట్రిపుట్​ఐటీ ఇన్​చార్జి వీసీ వెంకటరమణ

బాసర,వెలుగు: బాసర ట్రిపుల్​ ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేడెడ్​ కోర్సుకు ఎంపికైన విద్యార్థులంతా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ఇన్​చార్జి వీసీ వెంకటరమణ సూచించారు. శనివారం ఫ్రెషర్స్​1500 మందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు కలెక్టర్ ముషారఫ్​ అలీ ఫారూఖీతో కలిసి సోలార్ వాటర్​ ప్లాంట్​ను ప్రారంభించారు. ప్రతీ విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారూఖీ మాట్లాడుతూ పేద విద్యార్థులంతా ట్రిపుల్​ ఐటీలో సీట్లు దక్కించుకోవడం హర్షనీయమన్నారు. ఐఐటీలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ హేమంత్​ బోర్కడే, డైరెక్టర్ సతీశ్​కుమార్, డీఎం అండ్​హెచ్​వో ధనరాజ్, భైంసా తహసీల్దార్​ చంద్రశేఖర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి
 

ఖానాపూర్,వెలుగు: డాక్టర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని వైద్యా విధాన పరిషత్​(టీవీవీపీ) కమిషనర్​ డాక్టర్​ అజయ్​ కుమార్​ ఆదేశించారు. శనివారం ఆయన ఖానాపూర్​గవర్నమెంట్​ హాస్పిటల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరాతీశారు.ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది స్నేహ పూర్వకంగా మెలగాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. గర్భిణుల చికిత్స కోసం త్వరలో గైనాకాలజిస్టు పోస్టులను భర్తీ చేస్తా మన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్​ సూపరింటెండెంట్​ వంశీ మాధవ్, డాక్టర్లు చింత పండు రవి, తిలక్, నర్సింగ్ సూపరింటెండెంట్ రుక్మిణి, హెడ్ నర్స్ దేవాదయమని, సిబ్బంది ఇబ్రహీం, సుజాత,  జలీల్, రాము,శోభన్ బాబు, దత్తు  తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల కోసమే కేసీఆర్ ​అంబేద్కర్​ జపం
 

ఆసిఫాబాద్,వెలుగు: ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ అంబేద్కర్​జపం అందుకున్నారని ఎమ్మార్పీఎస్​ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్​రావు మాదిగ మండిపడ్డారు. శనివారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడితే దళితుల బతుకులు మారుతాయా? అని ప్రశ్నించారు.హైదరాబాద్​లో అంబేద్కర్ ​విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం దళితులు మరిచిపోలేదన్నారు. భవనాలకు అంబేద్కర్ ​పేరు పెట్టడం కాదని, భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్​ చేశారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలుచేయాలన్నారు. సమావేశంలో బేడ బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి పస్తం అంజన్న, లీడర్లు పస్తం సమ్మన్న, కొడగంటి తిరుపతి, కొండపల్లి జాను, అర్థం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు, పిల్లలను సభకు తరలిస్తారా?
డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ ఫైర్​​

భైంసా,వెలుగు: ముథోల్ లో నిర్వహించిన సమైక్య దినోత్సవానికి అధికార యంత్రాంగం దబాయించి మరీ స్కూల్​ పిల్లలు, డ్వాక్రా మహిళ సంఘాల సభ్యులను సభకు తరలించారని డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్​ ఫైర్ ​అయ్యారు.శనివారం ఆయన ఎస్ఎస్ ఫ్యాక్టరీలో మీడియాతో మాట్లాడారు. గంటల తరబడి పిల్లలు, మహిళలను ఎండలో నిలబెట్టి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు టెంట్ల కింద సీట్లు వేసుకొని కబుర్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలపై ఒత్తిడి తెచ్చి ఐకేపీ ఆఫీసర్లు సభకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం తాగేందుకు నీళ్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యత వహిసూ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బి.గంగాధర్, ఆనంద్​రావు పటేల్, వడ్నం శ్రీనివాస్, సుదర్శన్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి

బెల్లంపల్లి/తిర్యాణి,వెలుగు: ఆదివాసీ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో బెల్లంపల్లి అంబేద్కర్ ​విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కమ్మరి భీమయ్య, రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం శాంకరి మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్​ చేశారు. నిరసనలో లీడర్లు హస్తిచందు, నాయిని సాంబయ్య, జంపం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆదివాసీలు చేపట్టిన పాదయాత్ర తిర్యాణికి చేరుకుంది. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లోని సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. పాదయాత్రలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కోవ విజయ్, డివిజన్  ప్రెసిడెంట్ వెడ్మ భగవంతరావు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సుభాష్,  వాంకిడి తుడుం దెబ్బ ప్రెసిడెంట్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ ​కార్మికుల భిక్షాటన

మందమర్రి/నస్పూర్/బెల్లంపల్లి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులు చేస్తున్న సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. శనివారం మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లోని  కార్మిక వాడల్లో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జడ్పీ చైర్​ పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు వినతిపత్రం అందించారు. రామకృష్ణాపూర్​లో భిక్షాటన చేశారు. వీరికి టీడీపీ పార్లమెంట్ ప్రెసిడెంట్​ బి.సంజయ్​కుమార్​, ఇప్టూ నేషనల్​ లీడర్​ టి.శ్రీనివాస్, లాల్​కుమార్​, సంకె రవి మద్దతు పలికారు. కార్యక్రమాల్లో జేఏసీ లీడర్లు డి.బ్రహ్మనందం, దూలం శ్రీనివాస్​, ఎండి.జఫర్​, జెట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లిలో  సివిక్ ఆఫీస్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్ టీయూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ చాంద్ పాషా, హెచ్ఎంఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ్ర శంకరయ్య, జేఏసీ లీడర్లు ఎన్.కృష్ణవేణి, శ్యామ్, వెంకటి, ఎండీ గౌస్, రవి, భాను, శ్రీను, కొమురయ్య, మైసక్క, బుచ్చమ్మ, అమృత, రాజేశ్వరి, బోర్లకుంట రాములు, అబ్దుల్లా, లచ్చన్న, రాములు, సునీత తదితరులు పాల్గొన్నారు.

80 వేలకు తగ్గకుండా  దీపావళి బోనస్
 

నస్పూర్, వెలుగు: కార్మికులకు 80 వేలకు తగ్గకుండా దీపావళి బోనస్ ఇప్పిస్తామని హెచ్ఎంఎస్ లీడర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం ఏరియాలోని ఎస్​ఆర్పీ 1వ గనిపై జరిగిన గేట్​ మీటింగ్​లో మాట్లాడారు. గనిలో ప్రమాదంలో బండారి రాజలింగు మృతి దురదృష్టకరమన్నారు. కార్మికులకు లాభాల వాటా ఇప్పించడంలో గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు పూర్తిగా విఫమయ్యాయన్నారు. కార్యక్రమంలో లీడర్లు జీవన్ జోయల్, తిప్పారపు సారయ్య, సత్తన్న, లక్ష్మణ్‌, దామ రమేశ్, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.   

జనవాసాల్లోకి మొసలి
 

కడెం,వెలుగు: నీళ్లలో ఉండాల్సిన మొసలి జనవాసాల్లోకి వచ్చింది. కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ మొసలి గ్రామంలోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్​ ఆఫీసర్లు సమాచారం ఇవ్వడంతో వారు మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం కడెం ప్రాజెక్టులోకి వదిలారు. గ్రామం పక్కనే గోదావరి నది లోంచి మొసలి వచ్చి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు.

నిషేధిత గడ్డి మందు పట్టివేత
 

బెల్లంపల్లి రూరల్, వెలుగు: భీమిని మండలం అచ్చలాపూర్​నుంచి కారులో రవాణా అవుతున్న నిషేధిత గట్టిమందును పోలీసు శనివారం పట్టుకున్నారు. దీని విలువ రూ.1.10 లక్షలు ఉంటుందని ఎస్సై వెంకటేశ్​ తెలిపారు. గడ్డిమందును రవాణా చేస్తున్న రెబ్బెన మండలం దేవులగూడ గ్రామానికి చెందిన బానోతు రమేశ్, బానోతు మోహన్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంకటాపూర్​ గ్రామానికి చెందిన చందు మందు సప్లై చేసినట్లు తేలిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

పంచాయతీరాజ్​ సంఘటన్​ కో కన్వీనర్​గా సుజాత
 

ఆదిలాబాద్​ టౌన్,వెలుగు: రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర కో కన్వీనర్ గా ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత నియమితులయ్యారు. శనివారం యూత్​ కాంగ్రెస్​ లీడర్లు ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేశ్​రెడ్డి, ఉప సర్పంచ్ మల్లయ్య, రాకేశ్, నితిన్, రవి, ఫహీమ్​ పాల్గొన్నారు.