కాంగ్రెస్‌‌లో సెకండ్ లిస్టు రచ్చ.. టికెట్లు దక్కని నేతల ధర్నాలు, నిరసనలు

కాంగ్రెస్‌‌లో  సెకండ్ లిస్టు రచ్చ.. టికెట్లు దక్కని నేతల ధర్నాలు, నిరసనలు
  • గాంధీభవన్‌‌పై విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల దాడి.. పార్టీ జెండాల దహనం
  • పార్టీకి కొందరు రాజీనామా.. రెబల్‌‌గా పోటీ చేస్తామని హెచ్చరికలు
  • అభ్యర్థులను మార్చకుంటే నా సత్తా ఏంటో చూపిస్త: జంగా రాఘవరెడ్డి
  • మునుగోడులో రెబల్‌‌గా బరిలోకి దిగుత: చలమల కృష్ణా రెడ్డి
  • కన్నీటి పర్యంతమైన సుభాష్‌‌రెడ్డి, మర్సుకోల సరస్వతి, మాధవి రెడ్డి

హైదరాబాద్/నెట్​వర్క్, వెలుగు: కాంగ్రెస్ సెకండ్ లిస్టు ప్రకటన పార్టీలో చిచ్చు రేపింది. టికెట్ ఆశించి భంగపడిన లీడర్లు ధర్నాలు, నిరసనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొందరు పార్టీని వీడగా.. మరికొందరు భవిష్యత్​ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెప్తున్నా.. రెబల్‌‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తీవ్ర అసంతృప్తికి గురైన కొందరు నేతలు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 

ఎన్నో ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తమను కాదని.. రాత్రికిరాత్రి చేరినోళ్లకు టికెట్లు ఇచ్చారని, టికెట్లను అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇదిలా ఉండగానే కొందరు సీనియర్ లీడర్లు అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అన్యాయం చేశారు

చాలా మంది లీడర్లు సీటు వస్తుందని రేవంత్ రెడ్డిపై ఆశలు పెట్టుకున్నారు. ఎల్లారెడ్డి టికెట్ ఆశించిన సుభాష్ రెడ్డి, మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతా రెడ్డి, వనపర్తి టికెట్ ఆశించిన మేఘా రెడ్డికి సీటు దక్కలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న సుభాష్ రెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులుగా ఉన్న తన వర్గం లీడర్లూ రాజీనామా చేస్తున్నారని ఆయన ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమైన సుభాష్ రెడ్డి.. కన్నీటి పర్యంతమయ్యారు. కార్యకర్తలు పార్టీ జెండాలను రోడ్డుపై వేసి దహనం చేశారు. పార్టీ ఆఫీసులోని కాంగ్రెస్ నేతల ఫొటోలను ధ్వంసం చేశారు. డబ్బులతో మేనేజ్ చేసి మదన్ మోహన్ రావు టికెట్ తెచ్చుకున్నారని సుభాష్ రెడ్డి ఆరోపించారు. రేవంత్‌‌‌‌‌‌‌‌ను నమ్ముకున్నా చివరకు అన్యాయమే జరిగిందని వాపోయారు. సర్వేలు తమకు అనుకూలంగానే ఉన్నా.. హైకమాండ్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి తెచ్చి చిన్నారెడ్డి వనపర్తి టికెట్ తెచ్చుకున్నారని మేఘా రెడ్డి అనుచరులు మండిపడ్డారు. చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. మహేశ్వరం టికెట్​ పారిజాతా రెడ్డికి దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందని లిస్ట్ రిలీజ్ అయ్యే దాకా చర్చ సాగింది. అయితే చివరి నిమిషంలో ఆ సీటును కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి పార్టీ కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఆమె మనస్తాపానికి గురయ్యారు. టికెట్ హామీతోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన ఆమె.. ఇప్పడు టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తమ కార్యకర్తలతో సమావేశమై.. భవిష్యత్​ కార్యాచరణను ప్రకటిస్తారని సమాచారం.

నమ్మించి గొంతు కోశారు

కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు తన గొంతు కోశారని పరకాల టికెట్ ఆశించిన ఇనుగాల వెంకట్రామి రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను మార్చకుంటే తన సత్తా ఏంటో చూపిస్తానని వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడిన జంగా రాఘవరెడ్డి హెచ్చరించారు. హైకమాండ్ స్పందించకుంటే ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానన్నారు. హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను నమ్ముకునే ఇన్నేండ్లు పనిచేశానని హుస్నాబాద్ ఆశావహుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఐదేండ్లుగా పాలేరులో కష్టపడిన తనకు కాకుండా కొద్ది నెలల కిందట పార్టీలో చేరిన పొంగులేటికి టికెట్ ఇవ్వడమేంటని మాధవి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైకమాండ్ చెప్పిన పనులన్నింటినీ చేశానంటూ కార్యకర్తల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. నమ్ముకున్నోళ్ల గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ పార్టీ నేతలు వచ్చినా మాట్లాడుత: నాగం

బోగస్ సర్వేల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేశారని నాగర్​కర్నూల్ టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రాత్రికి రాత్రి దిగిన పారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు. పార్టీ మారడంపై కార్యకర్తల నిర్ణయమే ఫైనల్ అన్నారు. తనతో చర్చించేందుకు ఏ పార్టీ నేతలు వచ్చినా మాట్లాడతానని చెప్పారు. నాగర్​కర్నూల్​లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన తనను అకారణంగా పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్చర్ల టికెట్ ఆశించి భంగపడిన ఎర్రశేఖర్.. నవంబర్ 9న రెబల్‌‌‌‌‌‌‌‌గా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. వనపర్తి టికెట్ ఆశించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తున్నది.

నితిన్ మామ నగేశ్ రెడ్డి ఆవేదన

నిజామాబాద్ రూరల్ టికెట్ కోసం హీరో నితిన్ మామ నగేశ్ రెడ్డి ప్రయత్నించారు. అయితే చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి ఆ సీటును కేటాయించారు. ఈ నేపథ్యంలోనే నగేశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇస్తే నితిన్ కూడా ప్రచారం చేస్తానని చెప్పారని, కానీ ఎన్నో ఏండ్ల నుంచి పార్టీలో ఉన్న తనకు కాదని వేరేటోళ్లకు టికెట్ ఇవ్వడం బాధించిందని నగేశ్​ రెడ్డి చెప్పారు. తాను పార్టీలోనే ఉంటానన్నారు. నర్సాపూర్​ టికెట్​ను ఆవుల రాజిరెడ్డికి ఇవ్వడంపై గాలి అనిల్ కుమార్, రవీందర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్​లో ఈ ముగ్గురు అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ కోవర్ట్​ అయిన ఆవుల రాజిరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. వచ్చే జాబితాలోనైనా కొత్త అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్​చేశారు.

టికెట్లను అమ్ముకున్నరు

ఆసిఫాబాద్ టికెట్‌‌‌‌‌‌‌‌ను ఆదివాసీకి ఇవ్వకుండా డబ్బులున్న వ్యక్తికి అమ్ముకున్నారంటూ రేవంత్ రెడ్డిపై మర్సుకోల సరస్వతి మండిపడ్డారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కంటతడి పెట్టుకున్నారు. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఆసిఫాబాద్ ఏజెన్సీలో లంబాడాకు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. మరో ఆశావహుడు గణేశ్ రాథోడ్.. ఆదివాసీలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. శ్యామ్ నాయక్‌‌‌‌‌‌‌‌ను ఓడగొడతానని హెచ్చరించారు. ఒకప్పుడు టికెట్ దక్కలేదని తీవ్ర ఆరోపణలు చేసిన నారాయణ రావు పటేల్‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్ సస్పెండ్ చేసిందని, మళ్లీ ఇప్పుడు ఆయనకే ముధోల్ టికెట్ ఇచ్చిందని కిరణ్ కుమార్ వర్గీయులు ఆరోపించారు. భైంసాలో ఆయన అనుచరులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు.

మునుగోడు బరిలో ఉంట: చలమల కృష్ణా రెడ్డి

తనకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. మునుగోడు బరిలో ఉంటానని చలమల కృష్ణా రెడ్డి తేల్చి చెప్పారు. రాత్రికి రాత్రి వచ్చి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి టికెట్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి జంప్​ అవ్వాలనుకునే రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను ఎంతో పనిచేశానని, లిస్ట్​లో తన పేరున్నా చివరి నిమిషంలో రాజగోపాల్ చేరడంతో తన పేరును తొలగించారని ఆరోపించారు. తాను రెబల్​గా బరిలోకి దిగుతానని హెచ్చరించారు. చలమలకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు నిరసనలు చేపట్టారు.

హాఫ్ టికెట్‌‌‌‌‌‌‌‌గాళ్లకు ఇచ్చి.. నాకివ్వరా?: విష్ణువర్ధన్ రెడ్డి

జూబ్లీహిల్స్ టికెట్‌‌‌‌‌‌‌‌ను అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌కు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మైనంపల్లి, ఆయన కొడుక్కు టికెట్ ఇచ్చి తనకు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. హాఫ్ టికెట్‌‌‌‌‌‌‌‌ గాళ్లకు టికెట్ ఇచ్చి.. 20 ఏండ్ల నుంచి పార్టీ లో ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌పై చర్చించేందుకు అనుచరులతో భేటీ అయ్యారు. తర్వాత ఆయన అనుచరులు గాంధీభవన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. రేవంత్ ఫ్లెక్సీని చించి, పార్టీ జెండాలను తగులబెట్టారు. రేవంత్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూకట్​పల్లి టికెట్ ఆశించిన వెంగళ్​రావు.. మనస్తాపం తో పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మల్లు రవి, చరణ్​ కౌశిక్ యాదవ్‌‌‌‌‌‌‌‌ సహా పలువురు నేతలు ఆయన వద్దకు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు.