కొత్త ఇన్​చార్జ్ ​నేతృత్వంలో.. కాంగ్రెస్ కొత్త కమిటీలు?

కొత్త ఇన్​చార్జ్ ​నేతృత్వంలో.. కాంగ్రెస్  కొత్త కమిటీలు?
  • దీపాదాస్​ ఆధ్వర్యంలో త్వరలో కాంగ్రెస్​ మండల కమిటీలు
  • 3న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించే అవకాశం
  • కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్సీలపైనా మీటింగులో చర్చ

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​ పార్టీ సిద్ధమవుతున్నది. ఈ ఎలక్షన్​లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు కసరత్తు చేస్తున్నది. ‘టార్గెట్​ 15’ పేరుతో సమాయత్తమవుతున్న పార్టీ.. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 20కిపైగా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మూడో స్థానమే దక్కింది. ఈ నేపథ్యంలోనే ఈ సారి అలాంటి తప్పులు జరగకుండా మండల, గ్రామ స్థాయిలోనే ప్రాబ్లమ్స్​కు చెక్​ పెట్టాలని భావిస్తున్నది. అందులో భాగంగా గతంలో ప్రారంభించి మధ్యలో వదిలేసిన మండల కమిటీల నియామకాలను మళ్లీ ప్రారంభించే అవకాశాలున్నట్టుగా తెలుస్తున్నది. మండల కమిటీలను నియమిస్తే ఎన్నికల్లో నేతలు కొత్త ఉత్సాహంతో పనిచేస్తారని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఈనెల 3న గాంధీభవన్​లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రానికి కొత్త ఇన్​చార్జ్​గా వస్తున్న దీపాదాస్​ మున్షీ నేతృత్వంలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. ఈ సమావేశంలోనే మండల కమిటీలతో పాటు ఎమ్మెల్సీ, కార్పొరేషన్​ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది.

గతంలో నియమించిన కమిటీలపై నిరసనలు..

అసెంబ్లీ ఎన్నికలకుగానూ పార్టీని మండల స్థాయిలో బలపరిచేందుకు కాంగ్రెస్​ పార్టీ మండల కమిటీలను నియమించింది. దాదాపు ఓ వంద కమిటీల వరకు నియమించింది. అయితే, అది కాస్తా పెద్ద రచ్చకు దారి తీసింది. పలువురు నేతలు ఆ కమిటీలపై నిరసనను తెలిపారు. గాంధీభవన్​లో ఆందోళనలు నిర్వహించారు. దీంతో చేసేది లేక మండల కమిటీల నియామకాలను నిలిపివేసింది. ప్రస్తుతం లోక్​సభ ఎన్నికల వేళ విస్తృత ప్రచారం చేయాలంటే మండల కమిటీలను నియమించాలన్న డిమాండ్లు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 80కిపైగా నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి గతంలో చాలా సార్లు చెప్పారు. కానీ, చివరకు 64 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి కారణం మూడో స్థానంలో ఉన్న నియోజకవర్గాలు, జిల్లాల్లో మండల కమిటీలను పూర్తి స్థాయిలో నియమించకపోవడమేనని పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. నాడు లొల్లి పెట్టిన లీడర్లకు సర్దిచెప్పి మండల కమిటీలను నియమిస్తే.. కచ్చితంగా పెట్టుకున్న సీట్ల టార్గెట్​ను అందుకునేవాళ్లమని చెప్తున్నారు. 

యువతకే పెద్దపీట..

మండల కమిటీల నియామకాలను చేపడితే యువతరానికే పెద్దపీట వేయాలని పార్టీ నేతల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. యువ రక్తానికి బాధ్యతలు అప్పగిస్తే చురుగ్గా పనిచేస్తారని, పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తారని అంటున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ల నియామకంలోనూ యువతకే పెద్దపీట వేయాలనుకుంటున్న పార్టీ లీడర్లు.. మండల కమిటీల్లోనూ అదే దారిలో వెళ్తారని తెలుస్తున్నది. పదేండ్లకాలానికిగానూ పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియామకాలను చేపడితే క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠమవుతుందన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. 

కార్పొరేషన్లు, ఎమ్మెల్సీ పోస్టులు..

3న జరిగే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైనా చర్చించే చాన్స్ ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. కార్పొరేషన్ల చైర్మన్లకు తొలి విడతలో 20 మంది పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే, ఇప్పటికే పరిశీలనలో ఉన్న వారి పేర్లతో పాటు పీసీసీ అధికార ప్రతినిధులైన సామా రామ్మోహన్​ రెడ్డి, కొనగాల మహేశ్, మద్ది శ్రీనివాస్​ రెడ్డి, ఎస్సీ సెల్​ చైర్మన్​ ప్రీతం, కిసాన్​ కాంగ్రెస్​ స్టేట్​ ప్రెసిడెంట్​ అన్వేష్​ రెడ్డి, ఓయూ ఉద్యమ నేత కోట శ్రీనివాస్​తో పాటు పార్టీలోని మరికొన్ని అనుబంధ సంఘాల నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. పీసీసీ అధికార ప్రతినిధులుగా సామా రామ్మోహన్​ రెడ్డి, కొనగాల మహేశ్​పార్టీ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. దళితులు, రైతుల సమస్యలపై ప్రీతం, అన్వేష్​ రెడ్డి గళమెత్తారు. ఈ క్రమంలోనే వారి పేర్లూ తెరపైకి వస్తున్నాయి. దాంతో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. చివరి నిమిషంలో సీటు దక్కని మద్ది శ్రీనివాస్​ రెడ్డి పేరునూ కార్పొరేషన్​ కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఓయూ ఉద్యమ నేత కోట శ్రీనివాస్​ కూడా కార్పొరేషన్​ పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది. మేనిఫెస్టో రూపకల్పనలో తనవంతు సహకారం అందించిన బైకాని లింగం యాదవ్​ కూడా రేసులో ఉన్నారు. కొందరు నేతలు వారి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్​ లీడర్ల ద్వారా ఇప్పటికే లాబీయింగ్​ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. పార్టీ స్టేట్​ కొత్త ​ఇన్ చార్జ్​ దీపాదాస్​ మున్షి నేతృత్వంలో ఇది తొలి సమావేశం కావడంతో ఈ కీలకాంశాలపై వాడివేడిగానే చర్చ జరిగే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తున్నది.