- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేశ్ బాబు
ముదిగొండ, వెలుగు : సీపీఎం ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుతోందని, అసలు హత్య రాజకీయాలు ఎవరివో ప్రజలకు తెలుసని ముదిగొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని రమేశ్‌బాబు అన్నారు. బుధవారం మండల పరిధిలోని వెంకటాపురంలోని బుచ్చి రామయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడులో జరిగిన సామినేని రామారావు హత్య సంఘటన తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి ఖమ్మం జిల్లా పోలీస్ శాఖను అలర్ట్ చేశారని, దుండగులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా పాతలపాడులో అందరు పనిచేస్తున్నారని, సీపీఎం మాత్రం ఆ గ్రామంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు భట్టిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అభివృద్ధి మాత్రమేనని, హత్య రాజకీయాలు అణిచి వేసింది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని, హత్య రాజకీయాల వైపు కాదు, పార్టీలకతీతంగా అభివృద్ధి వైపు మాత్రమే భట్టి విక్రమార్క దృష్టి పెట్టారని తెలిపారు. రామారావు హత్యకు కారకులైన వారి పై చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మరికంటి కృష్ణ, మాజీ జడ్పీటీసీలు మందడపు నాగేశ్వరావు, పసుపులేటి దేవేంద్రర్ తదితరులు ఉన్నారు.
