రాబోయే రెండేళ్లలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు

రాబోయే రెండేళ్లలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు
  • ఆ పార్టీ నాయకుల మాటల్లో పొంతనే లేదు
  • ప్రజలకు మాత్రం ఏం చేస్తరు ?  
  • 70 ఏళ్లలో తెచ్చింది 3 వైద్య కళాశాలలే
  • మేం ఏడేళ్లలోనే 12 తెచ్చినం 
  • రాబోయే రోజుల్లో 33కు పెంపు
  • గీతారెడ్డి వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ అంటే గతం.. ఆ పార్టీ అంటేనే ఆగమాగం. అందులోని లీడర్ల వ్యాఖ్యల్లో పొంతనే లేదు. పార్టీలోనే ఐక్యతను సాధించలేకపోతున్న కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయగలుగుతుంది ?’ అని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన అమీర్ పేటలోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు పడకేశాయంటూ ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు’ అనే పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉండేదని, ఇప్పుడు ప్రజలంతా ‘నేను పోత బిడ్డ సర్కారు దవాఖాన ’కు అనే పరిస్థితి వచ్చిందన్నారు. సర్కారు దవాఖానాలకు వస్తున్న రోగుల సంఖ్యే అందుకు ఉదాహరణ అని చెప్పారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 3 మెడికల్ కాలేజీలే రాష్ట్రానికి రాగా, ఇప్పటికే తాము వాటిని  12కు పెంచామని చెప్పారు. రాబోయే రోజుల్లో వాటి సంఖ్యను 33కు పెంచుతామని హరీశ్ స్పష్టం చేశారు. ‘ వృత్తిరీత్యా డాక్టర్ అయిన గీతారెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడటం భావ్యం కాదు. మీ పక్కన ప్రెస్ మీట్ లో కూర్చున్న జగ్గారెడ్డిని సర్కారు దవాఖానాల గురించి అడిగి తెలుసుకోండి. రెండు రోజుల క్రితమే జగ్గారెడ్డి స్వయంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడి వైద్యసేవలను కొనియాడారు. మీరు కూడా సర్కారు ఆస్పత్రులు చూడటానికి రండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

వచ్చే రెండేళ్లలో 5240 ఎంబీబీఎస్ సీట్లు..
‘తెలంగాణ పిల్లలు వైద్య విద్య కోసం ఉక్రెయిన్, రష్యా, చైనాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావడానికి కాంగ్రెస్ పాలనే కారణం. 70 ఏళ్లలో తెలంగాణకు 700 ఎంబీబీఎస్ సీట్లనే కాంగ్రెస్ తెస్తే.. మేం గత 7 ఏళ్లలో 2840 సీట్లకు పెంచాం. వచ్చే రెండేళ్లలో దాన్ని 5240 ఎంబీబీఎస్ సీట్లను చేర్చబోతున్నాం. మీ అసమంజస విమర్శలను విని..  చరిత్రనంతా బయటపెట్టాల్సి వచ్చింది’  అని హరీశ్ పేర్కొన్నారు. ‘ బ్రిటీష్  వాళ్లు పెట్టిన గాంధీ దవాఖాన, నిజాం కట్టిన ఉస్మానియా ఆస్పత్రి తప్ప కొత్తగా మీరు తెలంగాణలో కట్టించిన దవాఖానాలేవీ లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో కొత్తగా 6000 పడకలు అందుబాటులోకి తేబోతోంది. వరంగల్ లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రాబోతోంది’ అని ఆయన ప్రకటించారు. బస్తీ దవాఖానాలు, టిమ్స్, డయాలసిస్ సెంటర్లు పెట్టాలన్న కనీస ఆలోచన కూడా కాంగ్రెస్ పాలకులకు రాలేదని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ  పథకం ద్వారా గత ఏడాది వ్యవధిలో రూ.850 కోట్ల విలువైన వైద్య సేవలు అందించామని వెల్లడించారు. పేదలకు వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉందని సాక్షాత్తూ  కేంద్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించలేదని.. సీఎం కేసీఆర్ స్వయంగా ఆ దవాఖానను సందర్శించి ఆధునీకరణ కోసం రూ.200 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 

 

 

మరిన్ని వార్తలు.. 

భారీగా పెరుగుతున్న వెహికల్స్
 

ఐదు నెలల్లో ఐదుగురు గుడ్ బై