పదేండ్లుగా ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది : పవన్ ఖేరా

పదేండ్లుగా ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది : పవన్ ఖేరా

న్యూఢిల్లీ: లోక్​సభలో రెండున్నర గంటలపాటు మాట్లాడనివ్వకపోతేనే మోదీ బాధపడ్తున్నారని, అలాంటిది పదేండ్లుగా మా గొంతు నొక్కుతున్నందుకు మేమెంత బాధపడాలని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ డిపార్ట్​మెంట్ హెడ్ పవన్ ఖేరా ప్రశ్నించారు. పదేండ్లుగా అపోజిషన్ పార్టీలను కేంద్రం అణిచి వేస్తోందని విమర్శించారు. ఈసారి ప్రజలు, స్టూడెంట్ల పక్షాన తాము గొంతెత్తినప్పుడు మాత్రం మోదీ ఏడుస్తూ కనిపించారని ఎద్దేవా చేశారు. పదేండ్ల ఎన్డీయే పాలనలో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని తెలిపారు.

అందుకే ఈసారి లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పారని అన్నారు. నీట్ పేపర్ లీకేజీతో 32లక్షల మంది స్టూడెంట్ల గొంతు నొక్కేశారని విమర్శించారు. సభలో మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే అని, ప్రతి గంటకు 19 మంది రైతులు, కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్ ఉన్నది దేశం కోసమే అని, ఒక రాజు కోసం కాదని పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు.

అపోజిషన్ పార్టీలు పార్లమెంట్​లో యువత, జవాన్లు, కార్మికులు, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనుల గొంతు వినిపిస్తున్నాయని తెలిపారు. క్వశ్చన్ అవర్​లో రెండో టాపిక్​గా నీట్ వ్యవహారం ఉందని, కానీ.. దానిపై చర్చించకుండానే ప్రధాని మోదీ వెళ్లిపోయారని కాంగ్రెస్ లోక్​సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్ అన్నారు. ప్రధానిగా నీట్ వ్యవహారంపై సమాధానం చెప్పే బాధ్యత మోదీకి లేదా? అని ప్రశ్నించారు.