తుక్కుగూడలో కాంగ్రెస్​ సభ

తుక్కుగూడలో కాంగ్రెస్​ సభ
  • ఏప్రిల్ ​ఫస్ట్​ వీక్​లో నిర్వహించేందుకు ఏర్పాట్లు 
  • హాజరు కానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్
  • మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న నేతలు
  • అసెంబ్లీ ఎన్నికల టైమ్​లోనూ తుక్కుగూడ మీటింగ్​లోనే ఆరు గ్యారంటీల ప్రకటన 
  • అదే సెంటి​మెంట్​తో ఎంపీ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆ పార్టీ.. ఈ మీటింగ్ తోనే ప్రచారాన్ని  షురూ చేయాలని భావిస్తున్నది. 

ఈ బహిరంగ సభకు అటెండ్ కావాలని పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనకు ఏఐసీసీ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో గల తుక్కుగూడలో సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. సుమారు 10 లక్షల మంది అటెండ్ అయ్యేలా ఈ మీటింగ్​కు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్​కు సెంటిమెంట్​గా తుక్కుగూడ 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏడాది సెప్టెంబర్ 16,17 తేదీల్లో రెండు రోజుల పాటు తుక్కుగూడలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ ను ఏఐసీసీ నిర్వహించింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, అన్ని రాష్ట్రాల పార్టీ ముఖ్యనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పార్టీ నేతలంతా ఈ మీటింగ్​కు హాజరయ్యారు. 

17న నిర్వహించిన మీటింగ్ లో సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మీటింగ్ తరువాత ఆరు గ్యారంటీలు క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్లాయి. కాగా, ఆ మీటింగ్ కు సుమారు 6 లక్షల మంది వచ్చినట్టు అప్పటి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. 

అయితే, అప్పుడు ఆ మీటింగ్ సక్సెస్ కావొద్దని హైదరాబాద్ లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ తో పాటు అప్పటి సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లు నిర్వహించినప్పటికీ ఆ రెండు మీటింగులు ఫ్లాప్ అయ్యాయి. కాంగ్రెస్ తుక్కుగూడ మీటింగ్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయి కాంగ్రెస్​లో కొత్త జోష్ నింపింది. దీంతో కాంగ్రెస్ కు తుక్కుగూడ సెంటిమెంట్‌గా మారిందని, ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే తుక్కుగూడ ప్లేస్ ను సెలెక్ట్ చేశామని పార్టీ నేతలు చెప్తున్నారు.

తెలుగులో మేనిఫెస్టో విడుదల

తుక్కుగూడ పబ్లిక్ మీటింగ్​లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ మేనిఫెస్టోను తెలుగులో రిలీజ్ చేస్తారని పీసీసీ నేతలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం 5 కేటగిరీల వారీగా 25 హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబై లో నిర్వహించిన భారత్ జోడ్ న్యాయ్​ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ “ఫైవ్ న్యాయ్” పేరుతో కిసాన్, యువ, నారీ, శ్రామిక్, హిస్సేదారీ ఇలా.. ఒక్కో వర్గానికి 5 హామీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.