
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని, కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్ ఎప్పుడు తెస్తారో చెప్పకుండానే రిజర్వేషన్లు అమలయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని విమర్శించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పి, ఆ హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, బీసీ రిజర్వేషన్లపై చర్చించాలని డిమాండ్ చేశారు.