
హైదరాబాద్, వెలుగు: చరిత్రలో నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించలేదని, మొన్నటికి మొన్న నేపాల్ లో ఏం జరిగిందో చూశామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. బుధవారం గన్ పార్క్ వద్ద నిరుద్యోగులతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిరుద్యోగులు మన పిల్లలే.. గాలికి వదిలేయొద్దు. వారికి దారి చూపించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నేపాల్ లో అవినీతి ప్రభుత్వంపై యువత ఎలా తిరగబడిందో మనం చూశాం’ అని అన్నారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతానికి అన్యాయం జరగొద్దని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ యువత డిమాండ్ సరైందేనని అన్నారు. గ్రూప్ 1 ఇష్యూను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు వినేందుకు సిటీ సెంట్రల్ లైబ్రరీకి, అశోక్ నగర్ కు వస్తానని, స్టూడెంట్స్ నిరసనలకు తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యలపై స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ను గద్దె దించడంలో యువతది కీలక పాత్ర అని, వారిని ఇప్పుడు విస్మరించడం సరైంది కాదన్నారు.