
పెట్టిన హెల్మెట్ పెట్టినట్లే ఉంది.. వర్షానికి తడవకుండా వేసుకున్న రెయిన్ కోర్టు అలానే ఉంది. రాత్రి 11 దాటినా వర్షం తగ్గకపోవడంతో.. ఇంట్లో వాళ్లు ఎదురు చూస్తుంటారని మెల్లిగా బయల్దేరుదామని బైక్ స్టార్ట్ చేశాడు. కానీ భారీ వర్షానికి భయంకరంగా ప్రవహిస్తున్న వరద.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుందని తెలుసుకోలేకపోయాడు. హైదరాబాద్ నగరంలో బుధవారం (సెప్టెంబర్ 17) కురిసిన భారీ వర్షానికి వరదల్లో కొట్టుకుపోయి యువకుడు చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
క్లౌడ్ బరస్ట్ అయ్యిందా అన్నట్లు నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నాళాలు ఉప్పొంగాయి. భారీ వరదలకు బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరదలో కొట్టుకుపోయిన యువకుడు చనిపోయాడు. మృతుడిని ముషీరాబాద్ కు చెందిన షరీఫ్ ఉద్దీన్ (27) గా గుర్తించారు పోలీసులు.
రాత్రి ఎంత సేపటికీ వర్షం తగ్గకపోవడంతో బైక్ పై మెళ్లిగా వెళ్దామని బయల్దేరాడు యువకుడు. రాత్రి 11 గంటల సమయానికి.. బల్కంపేట్ వైపు నుంచి బేగంపేట వైపు వెళుతుండా ఘోర ప్రమాదం జరిగింది. చిన్నపాటి నదిలా ప్రవహిస్తున్న వరద.. షరీఫ్ ను అమాంతం తనలో కలిపేసుకుపోయింది.
బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరద నీటి ప్రవాహంలో బైక్ తో సహా కొట్టుకుపోయాడు యువకుడు. స్థానిక కాలనీ వాసులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
ఇటీవల వరదలకు ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో.. కాస్త ఆలస్యమైనా పర్లేదు.. వర్షం, వరద తగ్గినాకే వాహనదారులు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.