
- గ్రూప్ 1 ఎగ్జామ్స్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదు ..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సూర్యాపేట, వెలుగు : రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన యూరియానే రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన పథకాలు అమలుచేస్తున్నామన్నారు.
సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సూర్యాపేటకు రావడం, మహనీయులను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో ఉందని, త్వరలోనే పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు.
గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్‌పై కొందరికి సందేహాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కష్టపడి ఉద్యోగం సాధించిన వారిని కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు.