
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియెట్ కు రావడం లేదని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మీడియాతో చిట్ చాట్ లో ఆరోపించడంపై విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ ఆ ఆరోపణలు చేస్తున్న సమయంలో సీఎం సెక్రటేరియెట్ లో తెలంగాణ ఎడ్యుకేషన్పాలసీపై సమీక్ష చేస్తున్నారని ఆది శ్రీనివాస్ మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రేవంత్ రెడ్డిపై ఏడవడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కేటీఆర్ కళ్లు ఏమయ్యాయి? కాకులు ఏమైనా ఎత్తుకుపోయాయా? అని ప్రశ్నించారు.
కనీసం సీఎంపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే హుందాగా ఉంటుందని హితవు పలికారు. బీఆర్ఎస్ ది ఫామ్ హౌస్ పాలన అని.. కాంగ్రెస్ ది ప్రజా పాలన అని గుర్తు చేశారు. నీచ రాజకీయాల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడమే కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నాడని ఫైర్ అయ్యారు. గ్రూప్1 ఉద్యోగాలు పొందిన వారిపై కేటీఆర్ మాట్లాడిన మాటలు నీచాతి నీచంగా ఉన్నాయని.. వారి తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా కేటీఆర్ అలా మాట్లాడడం చూస్తే ఆయనలో మానవత్వం మచ్చుకైనా లేదని అర్థం అవుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఎన్ని విమర్శలు చేసినా ఆయ్నను, వాళ్ల నాయనను తెలంగాణ ప్రజలు నమ్మరని ఆది శ్రీనివాస్పేర్కొన్నారు.