వాళ్ళు కారెక్కాలంటే అడ్డెవడు..

వాళ్ళు కారెక్కాలంటే అడ్డెవడు..

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జీవో 111  విషయంలో రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ రెడ్డి, అతని అనుచరులపై మండిపడుతూ..  ఫేస్ బుక్  పేజీల్లో రేవంత్ రెడ్డి అనుచరులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ కారు ఎక్కుతున్నారని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. వారు నిజంగా కారు ఎక్కాలంటే అడ్డెవడు అని ప్రశ్నించారు. రేవంత్‌ ఒక్కడే మగాడని, కాంగ్రెస్‌లో హీరోలే లేరంటూ వారు చేస్తున్న ప్రచారం..పార్టీలో పని చేస్తున్న సీనియర్ నేతలను ఇబ్బంది పెట్టేలా ఉందని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై చర్చించేందుకు వెంటనే టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

రేవంత్ రెడ్డికి మాత్రమే ఫ్యాన్స్ ఉన్నారా?

ఫేస్ బుక్ లాంటి సిస్టమ్స్ ఏవీ తమకు ఉండవని, తాము జనాల మధ్య  ఉండే నాయకులమని చెప్పారు జగ్గారెడ్డి. ఎవరో పైసలు పంపిస్తే లీడర్ లు కాలేదని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ బొమ్మలు పెట్టుకుని గెలిచామని ఆయన అన్నారు. “అయినా అభిమానులు రేవంత్ రెడ్డి కి ఒక్కరికే  ఉన్నారా.. ఫాన్స్ నాకు కూడా ఉన్నారు. పిలిస్తే సంగారెడ్డి నుండి వేల మంది అనుచరులు  వస్తారు. నాకు ఫాలోవర్ లు ఉన్నారు. చిటికేస్తే హైదరాబాద్ లో 10,000 మంది వస్తారు. రేవంత్ ను అడుగుతున్నా..  నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చను సోషల్ మీడియా ఎందుకు పెడుతున్నావ్.  జైల్లో కూర్చొని పీసీసీ పదవి ఎందుకు ఆశిస్తున్నావు. పార్టీ ఒక్కరిది కాదు అందరిదీ” అని వ్యాఖ్యానించారు.

నాకూ సీఎం కావాలని ఉంది. అయితనా?

కాంగ్రెస్ పార్టీ లో పీసీసీ, సీఎం కావాలని చాలా మందికి ఉందన్న జగ్గారెడ్డి..  తనకూ సీఎం కావాలని ఉందని వ్యాఖ్యనించారు.” నాకు సీఎం కావాలని ఉంది..అయితనా?  అది డిసైడ్ చేయాల్సింది సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. సీఎం ఎవరనేది సోనియాగాంధీ చెప్తారు. రేవంత్ రెడ్డి అనుచరులు ఈ న్యూసెన్స్ బంద్ చేయకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఉగాది తరువాత ఢిల్లీ కి వెళ్లి పిర్యాదు చేస్తాను” అని చెప్పారు.

మరి కొడంగల్ ఎందుకు ఓడాడు?

రేవంత్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారని అన్నారు.” రేవంత్ రెడ్డి మొగోడే కదా.. టీడీపీ లోనే ఉండి ప్రభుత్వంపై ఎందుకు  పోరాటం చేయలేదు. మా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చాడు? ఇక్కడ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు అందుకే ఇక్కడికి వచ్చాడు.  రేవంత్ రెడ్డి అంత తీస్ మార్ ఖాన్ అయితే కొడంగల్ లో ఎందుకు ఓడిపోయారు. తప్పులు చేసుడు ఎందుకు.. అరెస్ట్ అవుడు ఎందుకు?” అని అన్నారు జగ్గారెడ్డి.

పంచాయితీ ఉంటే మీరూ, మీరూ చూసుకొండి.

తన మీద చాలా ఆరోపణలు వచ్చినపుడు.. వాటన్నింటిని పార్టీకి రుద్దలేదన్నారు జగ్గారెడ్డి. పాస్ పోర్టు కేస్ లో అరెస్ట్ అయినపుడు బాధ పడ్డానని, అమీన్ పూర్ అసైన్డ్ భూముల విషయంలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తనకే తెలియదన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కు ఏదైనా పంచాయతీ ఉంటే వారే చూసుకోవాలని, తమ మీద ఎందుకు బురద చల్లుతున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. “ రేవంత్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా మేము నిరసన తెలిపాము. కానీ దాన్ని రేవంత్ రెడ్డి కాపాడుకోలేదు. రేవంత్ రెడ్డి తనంతట అరెస్ట్ అయ్యాడని బయట ప్రచారం చేస్తున్నారు. సీనియర్లు  పడిన కష్టం వృధా అవుతుంది. కేసీఆర్ ని ఎట్లా ఓడగొట్టాలని చూస్తుంటే .. ఇలా న్యూసెన్స్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ లో చూడాలా?  మీ  ఫేస్ బుక్ చూస్తూ మాట్లాడాలా. ?” అంటూ విరుచుకు పడ్డారు జగ్గారెడ్డి.