ప్రతిపక్ష నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వరా?

ప్రతిపక్ష నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వరా?

సంగారెడ్డి: ఆర్మీని ప్రైవేట్ పరం చేసేందుకే కేంద్రం అగ్నిపథ్ ను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సంగారెడ్డిలో కాంగ్రెస్  ఆధ్వర్యంలో  సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ... జై జవాన్, జై కిసాన్ అనేది దేశ నినాదమని, కానీ బీజేపీ ప్రభుత్వం జవాన్లు, రైతుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. నల్ల చట్టాలతో రైతుల ఉసురు పోసుకున్న మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆర్మీని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నా... బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సుభాష్ చంద్రబోస్ కు బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదని, రాజకీయ లబ్ది కోసం ఆయన ఫొటో వాడుతున్నారని ఆరోపించారు.

ఆర్మీ లో పని చేసిన వారికి రిటైరైతే భూమి ఇచ్చే వారని, కానీ బీజేపీ ఆ విధానానికి స్వస్థి పలికిందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం, మంత్రులు, అధికారులు అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చేవారని, కానీ ఇవ్వాళ ఓ కలెక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరకడంలేదన్నారు. ప్రజా సమస్యల గురించి వివరించడానికి కలిసే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు.