రైతులకు నష్టపరిహారం చెల్లించాలె

రైతులకు నష్టపరిహారం చెల్లించాలె

నిజామాబాద్: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇళ్లు కూలడంతో నిరాశ్రయులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలని కోరారు.  వేల్పూర్ మండలంలోని నడుకుడాలో వర్షాలకు చెక్ డ్యామ్ తెగి పంట నష్టపోయిన రైతులను సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో చెక్ డ్యామ్ ల్లో నీళ్లు రాలేదు గానీ...  వర్షాల వల్ల ఆ చెక్ డ్యామ్ లు తెగి పంట నష్టమయిందని ఎద్దేవా చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చాలా మంది రైతులు భూములు కోల్పోయారన్న ఆమె... ఇప్పుడు కాళేశ్వరం ముంపు వల్ల అంతకు రెట్టింపు రైతులు నష్టపోయారని ఫైర్ అయ్యారు. నిర్దుష్టమైన ప్రణాళిక లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తే... ఫలితాలు ఇలాగే ఉంటాయని కేసీఆర్ పై మండిపడ్డారు. తాను ఓ పెద్ద ఇంజనీర్ అని చెప్పుకునే కేసీఆర్... మరి కాళేశ్వరంలో పంపు హౌజ్ లు ఎలా మునిగాయో చెప్పాలని ప్రశ్నించారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్... ఇవాళ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. ఇప్పటికైనా రైతులకు పరిహారం చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు.